Jagadevpur: జగదేవపూర్‌ను కరువు మండలంగా ప్రకటించాలి
Jagadevpur: జగదేవపూర్ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని 25 గ్రామాల సర్పంచుల ఫోరం ఆధ్వర్యంలో ఎమ్మార్వో కార్యాలయం ఎదుట నిరసన, ప్రభుత్వానికి హెచ్చరిక.
Jagadevpur: జగదేవపూర్‌ను కరువు మండలంగా ప్రకటించాలి
జగదేవపూర్: సిద్దిపేట జిల్లాలోని జగదేవపూర్ మండలాన్ని సైతం కరువు మండలంగా ప్రకటించి, పంటలు నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలని సర్పంచుల ఫోరం డిమాండ్ చేసింది. మండలంలోని 25 గ్రామాల సర్పంచులు ఏకమై స్థానిక తహసీల్దార్ (ఎమ్మార్వో) కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. రైతుల కష్టాలను ప్రభుత్వం వెంటనే గుర్తించి, తగిన పరిహారం అందించాలని కోరారు.
ఈ సందర్భంగా సర్పంచులు మాట్లాడుతూ.. సిద్దిపేట జిల్లాలో ఎనిమిది మండలాలను మాత్రమే కరువు ప్రాంతాలుగా ప్రకటించడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. జగదేవపూర్ మండలంలోనూ ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. వర్షాలు కురుస్తాయనే ఆశతో, అందుబాటులో ఉన్న విద్యుత్ సదుపాయాలను వినియోగించుకుంటూ పంటలు సాగు చేసిన రైతులకు నిరాశే మిగిలిందన్నారు. మండలంలోని అనేక గ్రామాల్లో వరి పంటలు ఎండిపోయి, కనీసం కోత కోసుకునే పరిస్థితి కూడా లేకుండా పోయిందని పేర్కొన్నారు.
కాలువలు, ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందే ప్రాంతాలను కరువు మండలాలుగా గుర్తించిన అధికారులు.. వర్షాధార వ్యవసాయంపై ఆధారపడిన జగదేవపూర్ మండలాన్ని విస్మరించడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. పంటలు చేతికందకపోవడంతో రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కరువు సహాయక చర్యలను జగదేవపూర్ మండల రైతులకు కూడా వర్తింపజేసి, పంట నష్టానికి తగిన పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం, సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి జగదేవపూర్ మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలని సర్పంచుల ఫోరం కోరింది. రైతుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తే అన్ని రాజకీయ పార్టీలను, రైతులను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించింది.




