Siddipet: వెలికట్టలో ప్రభుత్వ భూములపై రెవెన్యూ అధికారుల భారీ సర్వే!

Siddipet: కొండపాక మండలం వెలికట్టలో 327 ఎకరాల ప్రభుత్వ భూమిపై రెవెన్యూ అధికారుల భారీ సర్వే. అసెంబ్లీలో మంత్రి పొంగులేటి వ్యాఖ్యల నేపథ్యంలో కదిలిన యంత్రాంగం.

MEER OSMAN ALI KHAN, GAJEWL
Published on: 22 Sept 2026 10:02 PM IST
Siddipet
X

Siddipet: వెలికట్టలో ప్రభుత్వ భూములపై రెవెన్యూ అధికారుల భారీ సర్వే!

సిద్దిపేట జిల్లా కొండపాక: కొండపాక మండలం వెలికట్ట శివారులోని ప్రభుత్వ భూముల ఆక్రమణలపై రెవెన్యూ యంత్రాంగం కదిలింది. సర్వే నంబర్ 271లోని 327.09 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ప్రభుత్వ సరిహద్దులను పక్కాగా గుర్తించేందుకు మంగళవారం రెవెన్యూ అధికారులు భారీ సర్వే కార్యక్రమాన్ని చేపట్టారు.

రాజీవ్ రహదారికి ఆనుకుని ఉన్న అత్యంత విలువైన ఈ భూమిలో గజ్వేల్ డివిజన్ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (ఆర్‌ఐ) వంశీ నేతృత్వంలో 16 మంది సభ్యుల ప్రత్యేక అధికారుల బృందం కొలతలు ప్రాంరంభించింది. ఆక్రమణలను అడ్డుకోవడం, ప్రభుత్వ భూమిని రక్షించడమే లక్ష్యంగా సరిహద్దు రాళ్లను పాతేందుకు సర్వే ముమ్మరంగా కొనసాగుతోంది.

ఇటీవల ముగిసిన శాసనసభ సమావేశాల్లో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెలికట్టలోని ప్రభుత్వ భూమి కొనుగోళ్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బాధితులు పాశి సత్యనారాయణ, శ్రీనివాస్‌లకు సంబంధించిన 6 ఎకరాల భూమిని పూర్వ మంత్రి హరీష్ రావు మామ హనుమంతరావు కొనుగోలు చేసినట్లు మంత్రి అసెంబ్లీ వేదికగా ప్రస్తావించారు.

మంత్రి వ్యాఖ్యల నేపథ్యంలో అప్రమత్తమైన ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రెవెన్యూ బృందాలు క్షేత్రస్థాయి పరిశీలనకు దిగాయి. మొత్తం 327.09 ఎకరాల భూమికి సంబంధించి స్పష్టమైన హద్దులు నిశ్చయించి, ఆక్రమణలకు గురైన భూమిని స్వాధీనం చేసుకునే దిశగా అధికారులు చర్యలు వేగవంతం చేశారు.

MEER OSMAN ALI KHAN, GAJEWL

MEER OSMAN ALI KHAN, GAJEWL