Husnabad: 40 మంది క్రీడాకారులకు ఉచిత శిక్షణ, వసతి: కబడ్డీ అకాడమీ!

Husnabad: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో 40 మంది బాలబాలికలకు శిక్షణ, వసతి కల్పించే కబడ్డీ అకాడమీ ఏర్పాటుకు ప్రభుత్వం జీవో నంబరు 1660 జారీ చేసింది. క్రీడాకారులు హర్షం వ్యక్తం చేశారు.

CH SRINIVAS, HUSNABAD
Published on: 16 Oct 2026 6:24 PM IST
Husnabad
X

Husnabad: 40 మంది క్రీడాకారులకు ఉచిత శిక్షణ, వసతి: కబడ్డీ అకాడమీ!

హుస్నాబాద్‌ అక్టోబర్ 16: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ నియోజకవర్గంలో కబడ్డీ అకాడమీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ 2026 అక్టోబరు 15న జీవో నంబరు 1660 జారీ చేసింది. అకాడమీ ద్వారా 40 మంది క్రీడాకారులకు శిక్షణ, వసతి సదుపాయాలు కల్పించనున్నారు.

అకాడమీలో 20 మంది బాలురు, 20 మంది బాలికలకు అవకాశం కల్పిస్తారు. వీరికి శిక్షణ అందించేందుకు బాలురు, బాలికలకు వేర్వేరుగా కోచ్‌లను నియమించనున్నారు. అదేవిధంగా వేర్వేరు వార్డెన్లతోపాటు గ్రౌండ్స్‌మెన్‌, స్వీపర్‌, సెక్యూరిటీ గార్డు సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు. మొత్తం ఎనిమిది సేవల నియామకానికి ప్రభుత్వం అనుమతించగా, ఔట్‌సోర్సింగ్‌ విధానంలో నియామకాలు చేపట్టనున్నారు.

క్రీడాకారుల హర్షం...

హుస్నాబాద్‌లో కబడ్డీ అకాడమీ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై స్థానిక క్రీడాకారులు హర్షం వ్యక్తం చేశారు. హుస్నాబాద్‌ కబడ్డీ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో కోచ్‌ కృష్ణ నేతృత్వంలో పీడీలు, పీఈటీలు, క్రీడాకారులు అంబేడ్కర్‌ చౌరస్తాలో బాణాసంచా కాల్చి, స్వీట్లు పంచుకున్నారు. అకాడమీ ఏర్పాటుకు కృషి చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల్లో కబడ్డీపై ఆసక్తి ఉన్న బాలబాలికలకు ఈ అకాడమీ ద్వారా శిక్షణ పొందే అవకాశం లభించనుంది. మెరుగైన శిక్షణ, వసతి సదుపాయాలతో క్రీడాకారులు తమ ప్రతిభను అభివృద్ధి చేసుకునేందుకు వీలుంటుందని స్థానిక క్రీడాభిమానులు అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో పీడీ ఆర్‌.శ్రీనివాస్‌, పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు వి.వెంకటరమణ, మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు వెన్న రాజు, పీఈటీలు అజయ్‌, వంశీ, సీనియర్‌ క్రీడాకారులు ఎస్‌.రాజేష్‌, సతీష్‌ వర్మ, సాయికృష్ణ, కత్తుల రఘు, అభినవ్‌, రాంచరణ్‌, అశ్వంత్‌, దిలీప్‌కుమార్‌, లాస్యశ్రీ, శాన్వి తదితరులు పాల్గొన్నారు.

CH SRINIVAS, HUSNABAD

CH SRINIVAS, HUSNABAD