Siddipet: మర్కుక్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన సీపీ రష్మి పెరుమాళ్!
Siddipet: మర్కుక్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన సిద్దిపేట సీపీ రష్మి పెరుమాళ్ విధుల్లో క్రమశిక్షణ పాటించాలి ప్రతి గ్రామంలో 'సిద్దిపేట సురక్ష నేత్ర' సీసీటీవీల ఏర్పాటుకు ఆదేశం.
Siddipet: మర్కుక్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన సీపీ రష్మి పెరుమాళ్!
సిద్దిపేట, సెప్టెంబర్ 28: సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మర్కుక్ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీలలో భాగంగా సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాళ్, IPS సోమవారం సందర్శించి, క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
ముందుగా పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న కమిషనర్‌కు మర్కుక్ ఎస్ఐ యూనుస్ అహ్మద్ అలీ సిబ్బందితో కలిసి రిపోర్ట్ చేశారు. అనంతరం ఎస్ఐ నిర్వహించిన పరేడ్‌ను సీపీ పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బంది కిట్ ఆర్టికల్స్, పోలీస్ స్టేషన్ ఆవరణలోని కేసులకు సంబంధించిన వాహనాలు, రికార్డులు, మరియు వివిధ వర్టికల్స్ పనితీరును సీపీ సుదీర్ఘంగా తనిఖీ చేసి, అధికారులకు పలు కీలక సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.
ప్రజలతో గౌరవప్రదంగా నడుచుకోవాలి
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ "ప్రతి పోలీస్ అధికారి మరియు సిబ్బంది విధుల్లో ఖచ్చితమైన క్రమశిక్షణ, సమయపాలన పాటించాలి. స్టేషన్‌కు వచ్చే బాధితుల సమస్యలను ఓపికగా విని, త్వరితగతిన పరిష్కరించాలి. కమ్యూనిటీ పోలీసింగ్‌కు అధిక ప్రాధాన్యతనిస్తూ ప్రజలలో పోలీస్ వ్యవస్థపై నమ్మకాన్ని, గౌరవాన్ని పెంచాలి" అని పేర్కొన్నారు.
‘సిద్దిపేట సురక్ష నేత్ర’తో నిఘా పెంపు
గ్రామీణ ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిరక్షణ మరియు నేరాల నియంత్రణే ధ్యేయంగా ప్రతి గ్రామంలో 'సిద్దిపేట సురక్ష నేత్ర' కార్యక్రమంలో భాగంగా సీసీటీవీ కెమెరాల నిఘాను పెంచేందుకు ఎస్ఐ చర్యలు తీసుకోవాలని సీపీ ఆదేశించారు. అలాగే గ్రామాల్లోని నిరుద్యోగ యువతకు 'సిద్దిపేట పోలీస్ ఉద్యోగ మిత్ర' ప్రోగ్రామ్ ద్వారా సరైన దిశా నిర్దేశం చేసి అవగాహన కల్పించాలన్నారు.
ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి
విధుల్లో నిరంతరం నిమగ్నమయ్యే క్రమంలో సిబ్బంది తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దని సీపీ సూచించారు. "నివారణే మేలైన మార్గం" అన్న సూత్రాన్ని గుర్తుచేస్తూ, ఆరోగ్య విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. అనంతరం సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుని, వాటిని త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో గజ్వేల్ ఏసిపి నరసింహులు, గజ్వేల్ రూరల్ సీఐ రవి రాజు, మర్కుక్ ఎస్ఐ యూనుస్ అహ్మద్ అలీ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.




