Gajwel: భూ సమస్యలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా భూభారతి రీ సర్వే
Gajwel: భూ సమస్యల శాశ్వత పరిష్కారానికే భూభారతి రీ సర్వే అని సిద్దిపేట కలెక్టర్ కె. హైమావతి తెలిపారు. గజ్వేల్ ఆరేపల్లిలో పర్యటించి వివరాలు వెల్లడించారు.
Gajwel: భూ సమస్యలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా భూభారతి రీ సర్వే
గజ్వేల్: భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించడంతో పాటు భూ రికార్డుల్లో పారదర్శకత, కచ్చితత్వం తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూభారతి భూముల రీ సర్వే కార్యక్రమాన్ని చేపట్టిందని సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె. హైమావతి తెలిపారు.
శుక్రవారం గజ్వేల్ మండలం ఆరేపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించిన భూభారతి భూముల రీ సర్వేపై అవగాహన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో మొదటి, రెండో విడతల్లో భాగంగా మొత్తం 103 గ్రామాల్లో భూముల రీ సర్వే చేపట్టనున్నట్లు వెల్లడించారు. తొలుత చిన్న గ్రామాలను ఎంపిక చేసి, అక్కడి భూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
ఆరేపల్లి గ్రామ పరిధిలోని 656 ఎకరాల భూమిని సర్వే చేయనున్నట్లు తెలిపారు. మొదట ప్రభుత్వ భూములు, గ్రామ సరిహద్దులను గుర్తించిన అనంతరం పట్టా భూముల సర్వే చేపడతామని పేర్కొన్నారు. అధునాతన రోవర్ యంత్రాల సహాయంతో గూగుల్, జీపీఎస్ ట్రాకింగ్ పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ అత్యంత కచ్చితత్వంతో, పారదర్శకంగా భూముల హద్దులను గుర్తించనున్నట్లు వివరించారు.
ప్రతిరోజూ సర్వేయర్, జీపీఓ, రెవెన్యూ రికార్డుల ఆధారంగా సుమారు 35 నుంచి 40 ఎకరాల వరకు సర్వే నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. సర్వే సమయంలో సంబంధిత భూ యజమానులు, రైతులు తప్పనిసరిగా తమ భూముల వద్ద ఉండి హద్దులను, సర్వే ప్రక్రియను పరిశీలించాలని సూచించారు. భూముల హద్దుల విషయంలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని, అవసరమైతే మరోసారి సర్వే చేయించుకోవాలని సూచించారు.
భూ సమస్యలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు రైతులు, భూ యజమానులు సర్వే అధికారులకు పూర్తి సహకారం అందించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ఏడీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ సుదర్శన్, గజ్వేల్ తహసీల్దార్, గ్రామ సర్పంచ్, సర్వే అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.




