Siddipet: అందరూ ఆరోగ్యంగా ఉండటమే హరీషన్న లక్ష్యం: సర్పంచ్ శ్రీనివాస్!
Siddipet: సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ పెద్దమ్మ ఆలయం వద్ద సింధు హాస్పిటల్ హైదరాబాద్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని సర్పంచ్ ఇట్టబోయిన శ్రీనివాస్ ప్రారంభించారు.
Siddipet: అందరూ ఆరోగ్యంగా ఉండటమే హరీషన్న లక్ష్యం: సర్పంచ్ శ్రీనివాస్!
సిద్దిపేట: ప్రజల ఆరోగ్యమే సమాజ అభివృద్ధికి అసలైన పునాది అని, ప్రతి కుటుంబం ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలనే సంకల్పంతో మాజీ మంత్రివర్యులు, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని చిన్నకోడూర్ గ్రామ సర్పంచ్ ఇట్టబోయిన శ్రీనివాస్ అన్నారు.
శనివారం చిన్నకోడూర్ మండల కేంద్రంలోని పెద్దమ్మ దేవాలయం వద్ద సింధు హాస్పిటల్ హైదరాబాద్ వారి సౌజన్యంతో నిర్వహించిన ఉచిత వైద్య ఆరోగ్య శిబిరాన్ని సర్పంచ్ ఇట్టబోయిన శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కాముని శ్రీనివాస్, ఉపసర్పంచ్ కన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. సాధారణంగా అనారోగ్య సమస్యలు వచ్చిన తర్వాతే చాలామంది ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారని, కానీ కొన్ని వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తిస్తే మెరుగైన చికిత్స పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల విషయంలో ప్రజలు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదని, భయంతో వైద్య పరీక్షలకు దూరంగా ఉండకుండా ముందస్తుగా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
సిద్దిపేట నియోజకవర్గ పరిధిలోని ప్రతి కుటుంబ సభ్యుడు ఆరోగ్యంగా ఉండాలనే గొప్ప ఉద్దేశంతో హరీష్ రావు ముందస్తు వైద్య పరీక్షలకు ప్రాధాన్యత కల్పిస్తున్నారని పేర్కొన్నారు. సింధు హాస్పిటల్ వైద్య బృందం సహకారంతో ప్రజలకు వైద్య పరీక్షలు అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. క్యాన్సర్ లక్షణాలు ఉన్నవారిని ముందుగానే గుర్తించి, అవసరమైన వారికి తదుపరి వైద్య పరీక్షలు, చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలన్నది ఈ కార్యక్రమం వెనుక ఉన్న ప్రధాన ఆశయమని వివరించారు.
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయడం వల్ల అనేక సమస్యలు ఎదురవుతున్నాయని, వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యుల సూచనలను పాటిస్తూ అవసరమైన పరీక్షలు చేయించుకోవాలని కోరారు.
ప్రజల వద్దకే వైద్య సేవలను తీసుకువచ్చే ఇలాంటి కార్యక్రమాలు గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగకరమని, ఆర్థిక ఇబ్బందుల కారణంగా వైద్య పరీక్షలు చేయించుకోలేని వారికి ఇవి మంచి అవకాశమని అన్నారు.
చిన్నకోడూర్ మండల ప్రజలు ఈ ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకొని తమ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవాలని సర్పంచ్ ఇట్టబోయిన శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. ఆరోగ్యమే మహాభాగ్యం.. ముందస్తు పరీక్షలే ఆరోగ్యానికి రక్షణ.. ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలని ఆకాంక్షించారు.
ఇట్టి కార్యక్రమంలో ఇట్టబోయిన శ్రీనివాస్, కాముని శ్రీనివాస్, ఉప సర్పంచ్ కన్నా రెడ్డి, కొలను రఘువర్మ, జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్, కాముని ఉమేష్ చంద్ర, పానుగంటి రమేశ్, ఎయ్య రాజయ్య, చెరుకు పెద్దులు, ఇట్టబోయిన కనకయ్య, కడారి శ్రీనివాస్ గ్రామ కార్యదర్శి, ఆశ వర్కర్లు, సిబ్బంది, పాల్గొన్నారు.




