Gajwel: ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంతోనే మహిళ మృతి!

Gajwel: సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో ప్రసవం తర్వాత మహిళ మృతి చెందడానికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ RVR ఆసుపత్రి ఎదుట బంధువులు మృతదేహంతో ఆందోళన చేపట్టారు.

MEER OSMAN ALI KHAN, GAJEWL
Published on: 5 Nov 2026 5:04 PM IST
Gajwel
X

Gajwel: ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంతోనే మహిళ మృతి!

Gajwel: ప్రసవం కోసం ఆసుపత్రికి వెళ్లిన ఓ మహిళ ఆపరేషన్ అనంతరం అనారోగ్య సమస్యలు తలెత్తి, చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో తీవ్ర కలకలం రేపింది. వైద్యుల నిర్లక్ష్యమే తమ కుటుంబ సభ్యురాలి మృతికి కారణమంటూ ఆరోపించిన మృతురాలి బంధువులు గజ్వేల్‌లోని RVR ఆసుపత్రి ఎదుట మృతదేహంతో ఆందోళనకు దిగారు.

వివరాల్లోకి వెళితే.. వర్గల్‌కు చెందిన పసుల కల్పన (22) ప్రసవం కోసం గజ్వేల్‌లోని RVR ఆసుపత్రికి వచ్చింది. ఈ క్రమంలో వైద్యులు ఆమెకు ఆపరేషన్ నిర్వహించారు. అయితే ఆపరేషన్ అనంతరం కల్పనకు మూత్ర విసర్జనకు సంబంధించిన సమస్య తలెత్తడంతో మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రి సిబ్బంది ఆమెను హైదరాబాద్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కల్పన బుధవారం ఉదయం మృతి చెందింది.

దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన మృతురాలి కుటుంబ సభ్యులు, కల్పన మృతికి RVR ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ ఆసుపత్రి ఎదుట మృతదేహంతో ఆందోళన చేపట్టారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, వైద్యుల నిర్లక్ష్యం ఉన్నట్లు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమ కుటుంబానికి న్యాయం చేయడంతో పాటు బాధిత కుటుంబానికి తగిన న్యాయం జరిగేలా అధికారులు స్పందించాలని కోరారు.

MEER OSMAN ALI KHAN, GAJEWL

MEER OSMAN ALI KHAN, GAJEWL