Gajwel: అమరులైన పోలీసుల త్యాగాలు చిరస్మరణీయం: సీఐ రవికుమార్
Gajwel: పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా గజ్వేల్‌లో సీఐ రవికుమార్ ఆధ్వర్యంలో ఘనంగా పోలీసుల సైకిల్ ర్యాలీ నిర్వహించారు.
Gajwel: అమరులైన పోలీసుల త్యాగాలు చిరస్మరణీయం: సీఐ రవికుమార్
గజ్వేల్: విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసుల త్యాగాలు చిరస్మరణీయమని గజ్వేల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ) రవికుమార్ తెలిపారు. పోలీసు అమరవీరుల సంస్కరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని, సిద్దిపేట జిల్లా గజ్వేల్ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన సైకిల్ ర్యాలీని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీఐ రవికుమార్ మాట్లాడుతూ.. ప్రజల మాన, ప్రాణాల రక్షణ కోసం పోలీసులు నిరంతరం అంకితభావంతో పనిచేస్తున్నారని అన్నారు. సమాజంలో శాంతిభద్రతలను కాపాడటంతో పాటు ఎలాంటి ఆపద ఎదురైనా ముందుండి రక్షణ కల్పించడంలో పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తున్న పోలీసుల సేవలను ప్రతి ఒక్కరూ గుర్తించాలని సూచించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అమరుల ఆశయాలను కొనసాగిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే వారికి ఇచ్చే నిజమైన నివాళి అని తెలిపారు. అమరుల త్యాగాలను భావితరాలకు తెలియజేయడంతో పాటు సమాజంలో పోలీసు వ్యవస్థ పట్ల గౌరవభావాన్ని పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని వివరించారు.
అమరుల కుటుంబాలకు అండగా నిలవాలి:
విధి నిర్వహణలో ఆప్తులను కోల్పోయి ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న అమరవీరుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలవాలని సీఐ విజ్ఞప్తి చేశారు. బాధితుల కుటుంబాల్లోని అర్హులైన ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించి, వారి జీవనోపాధికి భరోసానివ్వాలని కోరారు. దేశం మరియు సమాజ రక్షణ కోసం ప్రాణాలర్పించిన పోలీసుల కుటుంబాల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆకాంక్షించారు.
ర్యాలీలో గజ్వేల్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ, పోలీసు సిబ్బందితో పాటు వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ, పోలీసు సేవలపై ప్రజల్లో అవగాహన కల్పించారు. అమరులైన పోలీసుల సేవలు ప్రజల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతాయని పలువురు కొనియాడారు.




