Gajwel: వెలగని వీధిలైట్లు: చీకట్లో గజ్వేల్ గ్రామాలు

Gajwel: గజ్వేల్ పరిధిలోని ఆర్‌ అండ్‌ ఆర్‌ కాలనీ, ఎర్రవల్లి, సింగారం, వేములఘట్ గ్రామాల్లో వీధిలైట్లు వెలగక రహదారులు చీకటిమయమై ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్నారు.

MEER OSMAN ALI KHAN, GAJEWL
Updated on: 26 Oct 2026 8:35 PM IST
Gajwel
X

Gajwel: వెలగని వీధిలైట్లు: చీకట్లో గజ్వేల్ గ్రామాలు

గజ్వేల్‌: సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ నియోజకవర్గ పరిధిలోని ఆర్‌ అండ్‌ ఆర్‌ కాలనీతో పాటు ఎర్రవల్లి, సింగారం, వేములఘట్‌ గ్రామాల్లో వీధిలైట్లు వెలగకపోవడంతో ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత కొన్ని రోజులుగా వీధిలైట్లు పనిచేయకపోవడంతో సాయంత్రం వేళల్లో రహదారులన్నీ చీకటిమయంగా మారుతున్నాయి. దీంతో రాత్రి వేళ ప్రయాణాలు సాగించేవారు భయాందోళనకు గురవుతున్నారు.

ముట్రాజ్‌పల్లి రోడ్డు నుంచి ప్రధాన రహదారి మీదుగా ఆర్‌ అండ్‌ ఆర్‌ కాలనీకి, అక్కడి నుంచి గౌరారం వైపు వెళ్లే మార్గంలో వీధిలైట్లు వెలగకపోవడం సమస్యగా మారింది. రహదారిపై ఉన్న గుంతలు చీకట్లో కనిపించక ద్విచక్ర వాహనదారులు ప్రమాదాల బారిన పడే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలినడకన వెళ్లే మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలు సైతం చీకట్లో రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడుతున్నారు.

మరోవైపు, చీకటిని ఆసరాగా చేసుకుని అసాంఘిక కార్యకలాపాలు జరిగే అవకాశం ఉందని, పాములు, ఇతర విషపురుగుల సంచారంతోనూ ప్రమాదం పొంచి ఉందని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. ప్రధాన రహదారులకు అనుసంధానంగా ఉన్న మార్గాల్లోనే ఈ పరిస్థితి నెలకొనడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

అధికారులు స్పందించేదెప్పుడు?

వీధిలైట్లు వెలగకపోవడంతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను సంబంధిత అధికారులు గుర్తించి తక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. పనిచేయని వీధిలైట్లను మరమ్మతు చేసి, రాత్రి వేళల్లో రహదారులపై వెలుతురు ఉండేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రమాదాలు జరిగి ప్రాణనష్టం సంభవించకముందే అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని ఆర్‌ అండ్‌ ఆర్‌ కాలనీతో పాటు ఎర్రవల్లి, సింగారం, వేములఘట్‌ గ్రామాల ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

MEER OSMAN ALI KHAN, GAJEWL

MEER OSMAN ALI KHAN, GAJEWL