Rajagopalpet: రాజగోపాల్‌పేట పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఐజీ చంద్రశేఖర్

Rajagopalpet: సిద్దిపేట జిల్లా రాజగోపాల్‌పేట పోలీస్ స్టేషన్‌ను మల్టీ జోన్-1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి తనిఖీ చేసి, సైబర్ నేరాల నియంత్రణ, నాణ్యమైన దర్యాప్తుపై ఆదేశాలు జారీ చేశారు.

RAJU, SIDDIPET
Published on: 12 Nov 2026 5:01 PM IST
Rajagopalpet
X

Rajagopalpet: రాజగోపాల్‌పేట పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఐజీ చంద్రశేఖర్

Rajagopalpet: వార్షిక తనిఖీల్లో భాగంగా మల్టీ జోన్-1 ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ( ఐజి ) చంద్రశేఖర్ రెడ్డి గారు గురువారం సిద్దిపేట జిల్లా రాజగోపాల్‌పేట పోలీస్ స్టేషన్‌ను సందర్శించి తనిఖీ చేశారు.పోలీస్ స్టేషన్‌కు విచ్చేసిన ఐజీ గారికి సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాళ్ మొక్కను అందజేసి స్వాగతం పలికారు. అనంతరం ఐజీ పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, స్టేషన్ ఆవరణలో మొక్కను నాటారు.

ఈ సందర్భంగా ఐజీ గారు పోలీస్ స్టేషన్ సిబ్బందితో మాట్లాడి, వారి విధి నిర్వహణ వివరాలను, ఏవైనా వ్యక్తిగత లేదా వృత్తిపరమైన సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. స్టేషన్ పరిధిలో శాంతిభద్రతల పరిస్థితి, ఎక్కువగా నమోదవుతున్న కేసుల వివరాలను సమీక్షించారు.

సిబ్బందికి ఐజీ గారి కీలక సూచనలు:

పాత రోజులతో పోలిస్తే ప్రస్తుతం పోలీసు విధులు మెరుగుపడ్డాయని, అదే సమయంలో నేరాల తీరు కూడా మారిందని ఐజీ గారు పేర్కొన్నారు. ముఖ్యంగా సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో, సిబ్బంది సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు పెంపొందించుకోవాలని సూచించారు. స్టేషన్ పరిధిలో వివిధ నేరాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆదేశించారు. సిబ్బంది అందరూ నిజాయితీ, నిబద్ధతతో విధులు నిర్వర్తించాలని కోరారు. విధులతో పాటు ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలని, క్రమం తప్పకుండా హెల్త్ చెకప్‌లు, హెల్త్ ప్రొఫైలింగ్ చేయించుకోవాలని సూచించారు. ప్రతిరోజూ ఫిట్‌నెస్ వ్యాయామాలు చేయాలని తెలిపారు. విధి నిర్వహణలో ఉన్నా లేదా వ్యక్తిగత పనులపై బయటకు వెళ్లినా, ద్విచక్ర వాహనం నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని స్పష్టం చేశారు.

రికార్డులు, కిట్ ఆర్టికల్స్ తనిఖీ:

అనంతరం ఐజీ గారు పోలీస్ సిబ్బంది కిట్ ఆర్టికల్స్‌ను తనిఖీ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్టేషన్ ఆవరణలో ఉన్న నేరాలకు సంబంధించిన వాహనాలను పరిశీలించారు. రిసెప్షన్ వర్టికల్ పనితీరును, ఏటా స్టేషన్‌కు వస్తున్న ఫిర్యాదుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

తదుపరి స్టేషన్ రికార్డులు, క్రైమ్ రిజిస్టర్లు, పెండింగ్, దర్యాప్తు మరియు ట్రయల్ దశలో ఉన్న కేసుల స్థితిగతులను క్షుణ్ణంగా సమీక్షించారు. అన్ని కేసులలో నాణ్యమైన దర్యాప్తు చేపట్టి నిందితులకు శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని, ప్రతి కేసులో నిర్దేశిత ఎస్‌ఓపీ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని అధికారులను ఆదేశించారు.

అసాంఘిక శక్తులపై నిరంతర నిఘా కొనసాగించాలని, సైబర్ నేరాలు, ట్రాఫిక్ నియమాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటును ప్రోత్సహించాలని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు మెరుగైన, పారదర్శకమైన పోలీస్ సేవలు అందించేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఐజీ గారు స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో సిద్దిపేట సిపి రష్మి పెరుమాళ్ గారు , సిద్దిపేట ఏసిపి రవీందర్ రెడ్డి, సిద్దిపేట రూరల్ సీఐ విద్యాసాగర్, ఇన్స్పెక్టర్ కిరణ్ , ఇన్స్పెక్టర్ లతీఫ్, రాజగోపాల్ పేట ఎస్ఐ వివేక్, చిన్నకోడూరు ఎస్ఐ చంద్రమోహన్ , పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

RAJU, SIDDIPET

RAJU, SIDDIPET