Husnabad: వర్షాకాలంలో వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి రమేష్ రెడ్డి!

Husnabad: వర్షాకాలంలో వ్యాధులపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హుస్నాబాద్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమేష్ రెడ్డి సూచన. తగిన జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి.

CH SRINIVAS, HUSNABAD
Published on: 26 Sept 2026 8:49 AM IST
Husnabad
X

Husnabad: వర్షాకాలంలో వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి రమేష్ రెడ్డి!

Husnabad:వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు తమ ఆరోగ్యం, భద్రత పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమేష్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ప్రజలకు ఆయన పలు సూచనలు చేశాడు. వర్షాల కారణంగా చల్లబడినప్పటికీ, ఈ సీజన్ లో దోమలు, కలుషిత నీటి ద్వారా రకరకాల వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని హెచ్చరించారు. ప్రజలందరూ తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

ఇంటి పరిసరాల్లో పాత టైర్లు, కూలర్లు, ట్రేలలో ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని కోరారు. నిల్వ ఉన్న మంచి నీటిలోనే డెంగ్యూ, మలేరియా వంటి తీవ్రమైన వ్యాధులను సంక్రమింపజేసే దోమలు వృద్ధి చెందుతాయని స్పష్టం చేశారు.

ఈ కాలంలో తాగునీరు కలుషితమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున నీటిని బాగా కాచి, చల్లార్చిన తర్వాతే తాగడం శ్రేయస్కరమని తెలిపారు. ఈగలు వాలిన పదార్థాలను, బయటి ఆహారాన్ని అస్సలు తినకూడదని హెచ్చరించారు.

తీవ్రమైన జ్వరం, ఒళ్ళు నొప్పులు, వాంతులు, విరోచనాలు వంటి ముందస్తు లక్షణాలు కనిపిస్తే సొంత వైద్యం చేసుకోకుండా, వెంటనే సమీపంలోని ప్రభుత్వ లేదా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (పి హెచ్ సి) సంప్రదించాలని సూచించారు.

రోగుల వైద్య సేవల కోసం హుస్నాబాద్ ప్రభుత్వ హాస్పిటల్ తరఫున అన్ని రకాల మందులు, అవసరమైన సదుపాయాలను సిద్దంగా ఉంచామని సూపరింటెండెంట్ తెలిపారు. వ్యాధుల పట్ల ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని, అయితే ముందస్తు అప్రమత్తత మాత్రం చాలా ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.

CH SRINIVAS, HUSNABAD

CH SRINIVAS, HUSNABAD