Husnabad: కాంగ్రెస్ సోషల్ మీడియా వారియర్లకు మంత్రి పొన్నం దిశానిర్దేశం

Husnabad: హుస్నాబాద్ తిరుమల గార్డెన్స్‌లో కాంగ్రెస్ సోషల్ మీడియా సదస్సులో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్, తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

CH SRINIVAS, HUSNABAD
Published on: 10 Nov 2026 2:32 PM IST
Husnabad
X

Husnabad: కాంగ్రెస్ సోషల్ మీడియా వారియర్లకు మంత్రి పొన్నం దిశానిర్దేశం

సిద్దిపేట జిల్లా: హుస్నాబాద్ పట్టణంలోని తిరుమల గార్డెన్స్‌లో హుస్నాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరై పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. వైద్యరంగంలో స్పెషలైజేషన్‌కు ప్రాధాన్యత పెరిగినట్లుగానే, ప్రస్తుత రాజకీయాల్లో సోషల్ మీడియా కళ్లు, చెవులుగా మారి అత్యంత కీలక పాత్ర పోషిస్తోందన్నారు. సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలను తిప్పికొడుతూ, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని అన్నారు.

సన్నబియ్యం పంపిణీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు, రైతు రుణమాఫీ వంటి పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ముఖ్యంగా రైతు రుణమాఫీ పొందిన లబ్ధిదారులతో వీడియోలు రూపొందించి సోషల్ మీడియాలో ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు.

అలాగే నియోజకవర్గంలోని దివ్యాంగులు, వృద్ధులకు అలింకో సంస్థ ద్వారా చేతికర్రలు, బ్యాటరీ రిక్షాలు, కృత్రిమ కాళ్లు, చేతులు, వినికిడి పరికరాలు ఉచితంగా అందించే కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జనవరి నెలలో వందలాది కంపెనీల భాగస్వామ్యంతో భారీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

గ్రామీణ యువతలో క్రీడా నైపుణ్యాలను ప్రోత్సహించేందుకు ప్రతి గ్రామానికి లక్ష రూపాయలు, పెద్ద గ్రామాలకు రెండు లక్షల రూపాయల నిధులతో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ కోర్టులు, వాకింగ్ ట్రాక్‌లు, ఓపెన్ జిమ్‌లు ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ రూపొందించామని చెప్పారు.

అన్ని గ్రామాల్లో తాగునీటి ఫిల్టర్లు ఏర్పాటు చేయడంతో పాటు, ప్లాస్టిక్ రహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు మహిళా సంఘాలకు ప్రత్యామ్నాయ వస్తువులు, హోటళ్లకు స్టీల్ గ్లాసులు పంపిణీ చేస్తున్నామని వివరించారు. కబడ్డీ అకాడమీ, స్విమ్మింగ్ పూల్ నిర్మాణంతో పాటు కళలు, నృత్యాల్లో యువతకు ప్రత్యేక శిక్షణ అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

ఇందిరమ్మ ఇళ్లు సహా ఇతర సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి పక్షపాతం ఉండకూడదని, అర్హులైన పేదలకు మాత్రమే న్యాయం జరిగేలా చూడాలని పార్టీ శ్రేణులకు సూచించారు.

కాంగ్రెస్ పార్టీ వారియర్లుగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికీ, ప్రతి గడపకూ చేరవేయాల్సిన బాధ్యత సోషల్ మీడియా కార్యకర్తలపై ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు.

CH SRINIVAS, HUSNABAD

CH SRINIVAS, HUSNABAD