Mulugu: కుల వివక్షకు గురైన మాదిగ అయ్యప్ప స్వాములకు జాగృతి సంఘం పరామర్శ!

Mulugu: సిద్దిపేట జిల్లా ములుగులో కుల వివక్షకు గురైన మాదిగ అయ్యప్ప స్వాములను మాదిగ జాగృతి సంఘం నేతలు గురువారం పరామర్శించి సంఘీభావం తెలిపారు.

Osman Pathan, GAJEWL
Published on: 26 Nov 2026 11:00 PM IST
Mulugu
X

Mulugu: కుల వివక్షకు గురైన మాదిగ అయ్యప్ప స్వాములకు జాగృతి సంఘం పరామర్శ!

సిద్దిపేట జిల్లా: ములుగు మండల కేంద్రంలో కుల వివక్షకు గురైన మాదిగ సామాజిక వర్గానికి చెందిన అయ్యప్ప దీక్ష స్వాములను మాదిగ జాగృతి సంఘం జిల్లా కమిటీ నాయకులు పరామర్శించారు.

ములుగు గ్రామంలో అయ్యప్ప మాల ధరించి దీక్ష చేపట్టిన మాదిగ సామాజిక వర్గానికి చెందిన స్వాములను, ఇతర సామాజిక వర్గాలకు చెందిన అయ్యప్ప స్వాములు ఒకే సన్నిధానంలో కలిసి ఉండేందుకు అనుమతించకుండా వివక్ష చూపినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఘటన నేపథ్యంలో మాదిగ జాగృతి సంఘం జిల్లా కమిటీ సభ్యులు గ్రామాన్ని సందర్శించి బాధిత స్వాములను కలిసి సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు సదన్ మహారాజ్ మాట్లాడుతూ.. అయ్యప్ప మాల ధరించిన మాదిగ భక్తులపై కుల వివక్ష చూపడాన్ని తీవ్రంగా ఖండించారు. అయ్యప్ప స్వామిపై అపారమైన భక్తి విశ్వాసాలతో మాలధారణ చేసి, నియమనిష్ఠలతో దీక్ష చేపట్టిన భక్తులను కులం పేరుతో అవమానించడం, వివక్షకు గురిచేయడం, సామాజికంగా వెలివేసేందుకు ప్రయత్నించడం ఆందోళనకరమని అన్నారు. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమానత్వపు హక్కుతో పాటు మత స్వేచ్ఛను కల్పించిందని గుర్తుచేశారు. కులం ఆధారంగా మనుషుల భక్తిని, ఆధ్యాత్మిక హక్కులను నిర్ణయించాలనుకోవడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు.

మాదిగ సమాజం సహనాన్ని బలహీనతగా భావించవద్దని, తమ ఆత్మగౌరవాన్ని కించపరిచే ఎలాంటి చర్యలనైనా రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాదిగ జాగృతి సంఘం రాష్ట్ర నాయకుడు లింగంపల్లి భాస్కర్, జిల్లా నాయకుడు కట్ల అంజిబాబు, అయ్యప్ప దీక్ష స్వాములు, గ్రామ కులపెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Osman Pathan, GAJEWL

Osman Pathan, GAJEWL