Gajwel: గజ్వేల్‌లో గర్భిణులకు ఘనంగా శ్రీమంతాల వేడుక.. సత్కారం!

Gajwel: గజ్వేల్‌లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గర్భిణులకు ‘అమ్మకు వందనం’ పేరిట శ్రీమంతాల వేడుక ఘనంగా నిర్వహించారు.

Osman Pathan, GAJEWL
Published on: 28 Nov 2026 11:48 AM IST
Gajwel
X

Gajwel: గజ్వేల్‌లో గర్భిణులకు ఘనంగా శ్రీమంతాల వేడుక.. సత్కారం!

Gajwel: గజ్వేల్ మాతృత్వానికి గౌరవం చాటుతూ, గర్భిణీ స్త్రీల్లో ఆనందాన్ని నింపే లక్ష్యంతో లయన్స్ క్లబ్ ఆఫ్ గజ్వేల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘అమ్మకు వందనం’ కార్యక్రమం ఘనంగా జరిగింది. గజ్వేల్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన ఈ వేడుకలో గర్భిణీ స్త్రీలకు సంప్రదాయబద్ధంగా శ్రీమంతాలు నిర్వహించి ఘనంగా సత్కరించారు.

పసుపు, కుంకుమ, గాజులు, పూలు, పండ్లు అందజేసి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో సాగిన ఈ కార్యక్రమం పండుగ శోభను సంతరించుకుంది.

ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ విజయలక్ష్మి మాట్లాడుతూ.. మాతృత్వం అనేది మాటల్లో వర్ణించలేని పవిత్రమైన అనుభూతి అని అన్నారు. గర్భిణీ స్త్రీలకు కుటుంబ సభ్యులతో పాటు సమాజం కూడా ప్రేమ, ఆప్యాయత, ఆదరణ అందించాల్సిన అవసరం ఉందన్నారు.

వారి ముఖాల్లో చిరునవ్వులు నింపడంతో పాటు, మనోధైర్యాన్ని పెంపొందించి మాతృత్వానికి తగిన గౌరవం కల్పించడమే ‘అమ్మకు వందనం’ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని వివరించారు. లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాలకే పరిమితం కాకుండా సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమం, సంతోషం కోసం నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు. మానవీయ విలువలు, సామాజిక బాధ్యతను ప్రతిబింబించే ఇలాంటి కార్యక్రమాలను మరిన్ని నిర్వహిస్తామని తెలిపారు.

సాధారణంగా కుటుంబాలకే పరిమితమయ్యే శ్రీమంతాల వేడుకను సామాజిక సేవలో భాగంగా నిర్వహించి గర్భిణీ స్త్రీలకు ఆత్మీయతను పంచడం పలువురిని ఆకట్టుకుంది. మహిళల పట్ల గౌరవం, మాతృత్వం పట్ల మమకారం, సమాజ సేవ పట్ల అంకితభావం ఈ కార్యక్రమంలో ప్రతిబింబించాయి.

ఈ కార్యక్రమంలో అమర్నాథ్ రావు, బండారు రామ్ పనిధర్ రావు, జిల్లా రమేష్, మర్రి ప్రవీణ్, డాక్టర్ కుమారస్వామి, గుడాల రాధాకృష్ణ, సంజయ్ గుప్తా, మల్లేశం గౌడ్, టి. స్వామి, తాటి రాములు, అధికారి దేవసాని వాసుదేవ్ తదితరులు పాల్గొన్నారు.

Osman Pathan, GAJEWL

Osman Pathan, GAJEWL