Jagadevpur: ఏడాదిగా ప్రజావాణి చుట్టూ తిరుగుతున్న దివ్యాంగుడు

Jagadevpur: సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన దివ్యాంగుడు గుండ్రు స్వామి ఇందిరమ్మ ఇల్లు కోరుతూ ప్రజావాణిలో అర్జీ పెట్టుకున్నాడు.

Osman Pathan, GAJEWL
Published on: 17 Nov 2026 7:21 PM IST
Jagadevpur
X

Jagadevpur: ఏడాదిగా ప్రజావాణి చుట్టూ తిరుగుతున్న దివ్యాంగుడు

జగదేవపూర్: జగదేవపూర్ మండలం ప్రభుత్వం పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం కొందరు అర్హులకు మాత్రం అందని ద్రాక్షగా మారుతోంది. ఇందుకు తిమ్మాపూర్ గ్రామానికి చెందిన దివ్యాంగుడు గుండ్రు స్వామి పరిస్థితి నిదర్శనంగా నిలుస్తోంది.

ఇద్దరు కుమార్తెలు ఉన్న గుండ్రు స్వామి సరైన నివాస సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ గత ఏడాది కాలంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి వెళ్లి అధికారులకు పలుమార్లు అర్జీలు సమర్పించాడు. ఇప్పటివరకు సుమారు 20 సార్లు దరఖాస్తు చేసుకున్నప్పటికీ సమస్యకు పరిష్కారం లభించలేదు. తన దరఖాస్తు కలెక్టర్ లాగిన్‌లోనే పెండింగ్‌లో ఉన్నట్లు బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా పేదలకు అండగా నిలవాల్సిన తరుణంలో, ఒక దివ్యాంగుడు తనకు రావాల్సిన ఇంటి కోసం ఏడాది కాలంగా అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొనడం విచారకరం. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన ప్రజావాణిలో పదేపదే దరఖాస్తులు సమర్పించినా ఫలితం లేకపోవడం అధికారుల స్పందనపై ప్రశ్నలు తలెత్తేలా చేస్తోంది.

ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకుని గుండ్రు స్వామి పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించాలని, నిబంధనల ప్రకారం ఆయన అర్హతను నిర్ధారించి అర్హుడైతే వెంటనే ఇందిరమ్మ ఇంటి మంజూరు ప్రొసీడింగ్స్ జారీ చేసేలా సంబంధిత అధికారులను ఆదేశించాలని స్థానికులు కోరుతున్నారు. నిరుపేద దివ్యాంగుడికి న్యాయం జరిగేలా జిల్లా యంత్రాంగం స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Osman Pathan, GAJEWL

Osman Pathan, GAJEWL