Gajwel: మార్కుక్ తెలంగాణ పబ్లిక్ స్కూల్ నియామకాల్లో అక్రమాలు: MRPS ధ్వజం!

Gajwel: మార్కుక్ తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఉద్యోగ నియామకాల్లో అక్రమాలు జరిగాయని, సమతా ఏజెన్సీని తొలగించి అధికారులను సస్పెండ్ చేయాలని MRPS డిమాండ్ చేసింది.

MEER OSMAN ALI KHAN, GAJEWL
Published on: 6 Nov 2026 7:13 PM IST
Gajwel
X

Gajwel: మార్కుక్ తెలంగాణ పబ్లిక్ స్కూల్ నియామకాల్లో అక్రమాలు: MRPS ధ్వజం!

గజ్వేల్: మార్కుక్ తెలంగాణ పబ్లిక్ స్కూల్‌లో ఉద్యోగ నియామకాల విషయంలో అధికారులు, ఏజెన్సీ కుమ్మక్కై అక్రమాలకు పాల్పడుతున్నారని MRPS నాయకులు ఆరోపించారు. ఉద్యోగాలను విక్రయిస్తున్నారంటూ తీవ్ర విమర్శలు చేశారు. సమతా ఏజెన్సీని వెంటనే తొలగించడంతో పాటు, అక్రమాలకు పాల్పడిన అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో నిరుద్యోగులతో కలిసి MRPS ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కలెక్టరేట్ ముట్టడి చేపడతామని హెచ్చరించారు.

గజ్వేల్ నియోజకవర్గంలో నిర్వహించిన మీడియా సమావేశంలో MRPS సీనియర్ నాయకులు మైసరాములు మాదిగ మాట్లాడుతూ.. తెలంగాణ పబ్లిక్ స్కూల్‌లో ఉద్యోగ నియామకాల ప్రక్రియలో పారదర్శకత లోపించిందని ఆరోపించారు. పత్రికా ప్రకటనలో కొన్ని ఉద్యోగాల వివరాలను మాత్రమే ప్రచురించి, మిగతా ఖాళీల వివరాలను ఎందుకు వెల్లడించలేదని ప్రశ్నించారు.

ఉద్యోగాల నియామకాల్లో అక్రమాలు చోటుచేసుకున్నందునే కొన్ని పోస్టుల వివరాలను ప్రకటించలేదని అనుమానం వ్యక్తం చేశారు. అర్హులైన అభ్యర్థులకు పారదర్శకంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సమతా ఏజెన్సీని తక్షణమే తొలగించి, అక్రమాలకు పాల్పడిన విద్యాశాఖ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

MRPS సిద్ధిపేట జిల్లా మాజీ అధ్యక్షులు ముండ్రాతి కృష్ణ మాట్లాడుతూ.. ఉద్యోగ నియామకాల్లో అక్రమాలకు పాల్పడిన అధికారులను వెంటనే విధుల నుంచి తప్పించాలని, సమతా ఏజెన్సీని బేషరతుగా మార్చాలని డిమాండ్ చేశారు. అర్హత కలిగిన నిరుద్యోగులకు న్యాయం జరిగేలా నియామకాలను పూర్తిస్థాయి పారదర్శకతతో చేపట్టాలని కోరారు. తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించకపోతే నిరుద్యోగులతో కలిసి MRPS ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కలెక్టరేట్ ముట్టడి నిర్వహిస్తామని హెచ్చరించారు.

ఈ మీడియా సమావేశంలో MRPS సీనియర్ నాయకులు శెనిగరి రమేశ్ మాదిగ, కుకునూర్‌పల్లి మండల ఇన్‌చార్జి చిన్నరాజుగారి కిషన్ మాదిగ, మార్కుక్ మండల ఇన్‌చార్జి మొండి రమేశ్ మాదిగ, గజ్వేల్ అధ్యక్షులు చింతకింది యాదగిరి మాదిగ, MSP టౌన్ అధ్యక్షులు ఇదోళ్ల యాదగిరి మాదిగ, టౌన్ ప్రధాన కార్యదర్శి ఎర్రవల్లి యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

MEER OSMAN ALI KHAN, GAJEWL

MEER OSMAN ALI KHAN, GAJEWL