Husnabad: చిరుధాన్యాలతోనే సంపూర్ణ ఆరోగ్యం: అంగన్‌వాడీ సూపర్‌వైజర్ జయప్రద!
Husnabad: హుస్నాబాద్ మండలం పందిల్లలో పోషణ మాసం సందర్భంగా చిరుధాన్యాల వంటకాల ప్రదర్శన నిర్వహించి, మహిళలకు బహుమతులు అందజేశారు.
Husnabad: చిరుధాన్యాలతోనే సంపూర్ణ ఆరోగ్యం: అంగన్‌వాడీ సూపర్‌వైజర్ జయప్రద!
హుస్నాబాద్: హుస్నాబాద్ మండలం పందిల్ల గ్రామంలో అంగన్‌వాడీ ఆధ్వర్యంలో పోషణ మాసం మహోత్సవాలను మంగళవారం ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఘనంగా నిర్వహించారు. పోషణ మాసం సందర్భంగా గ్రామ మహిళలు చిరుధాన్యాలు, తృణధాన్యాలతో తయారు చేసిన వివిధ రకాల పిండివంటలను తీసుకొచ్చి ప్రదర్శించారు.
ఈ సందర్భంగా అంగన్‌వాడీ సూపర్‌వైజర్ జయప్రద మాట్లాడుతూ మహిళలు, చిన్నారుల్లో పోషకాహార లోపం వల్ల విటమిన్ల లోపం ఏర్పడి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. రోజువారీ ఆహారంలో చిరుధాన్యాలు, పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలను చేర్చుకోవాలని సూచించారు.
వివిధ రకాల వంటకాలను తీసుకొచ్చిన మహిళలకు అంగన్‌వాడీ టీచర్ శారద ఆధ్వర్యంలో సర్పంచ్ తోడేటి రమేష్, పాలకవర్గ సభ్యులు బహుమతులు అందజేశారు. అనంతరం చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సీడబ్ల్యూసీ) పందిల్ల గ్రామ కమిటీని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో సీడబ్ల్యూసీ కోఆర్డినేటర్ రాజు, సునీత, ఉపసర్పంచ్ పెండ్యాల సంపత్‌రెడ్డి, వార్డు సభ్యులు, అంగన్‌వాడీ సిబ్బంది, గ్రామ మహిళలు పాల్గొన్నారు.




