Husnabad: వచ్చే సీజన్లో వరి పంట వాయిదా వేయండి
Husnabad: హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు వద్ద బతుకమ్మ ఏర్పాట్లను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. ఎల్ నినో కారణంగా వరి సాగు వాయిదా వేయాలని రైతులకు విజ్ఞప్తి.
Husnabad: వచ్చే సీజన్లో వరి పంట వాయిదా వేయండి
హుస్నాబాద్: వాతావరణ ప్రతికూల పరిస్థితుల కారణంగా వచ్చే సీజన్ లో రైతులు వరి పంట వాయిదా వేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. వరి పంట కాకుండా నీటి లభ్యత ఆధారంగా ఇతర పంటలు వేసుకోవాలని సూచించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని ఎల్లమ్మ చెరువును అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి సందర్శించారు.
ఎల్లమ్మ చెరువు సుందరీకరణ పనులను, సద్దుల బతుకమ్మ పండుగ ఏర్పాట్లను పరిశీలించారు. సద్దుల బతుకమ్మ కోసం ఎల్లమ్మ చెరువు దగ్గర ఘనంగా ఏర్పాట్లు చెయ్యబడ్డాయని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు, గ్లాస్ బ్రిడ్జ్, పక్కనే అనుకోని ఉన్న గుట్టను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు.
కబడ్డీ అకాడమీతో పాటు, హుస్నాబాద్ కు స్విమ్మింగ్ ఫుల్ కూడా మంజూరు అయ్యిందని వెల్లడించారు. 2007 లో శంకుస్థాపన చేసిన గౌరవెల్లి ప్రాజెక్టు అడ్డంకులు, సుప్రీంకోర్టు కేసు అవరోధాలు కూడా తొలగిపోయి కాలువల కోసం భూ సేకరణ జరుగుతోందన్నారు.
త్వరలోనే గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేస్తామని, ఇరిగేషన్ పనులకు ప్రాధాన్యత ఇస్తున్నమన్నారు. వ్యవసాయానికి విద్యుత్ కు సంబంధించి ఈ పంట వరకు ఉదయం నుండి సాయంత్రం దాకా రాత్రి కూడా కొంత సమయం విద్యుత్ ఇవ్వాలని అధికారులకు ఆదేశించామన్నారు.
ప్రకృతి వైపరీత్యం ఎల్ నినో ప్రభావమని, ఇదేదో కాంగ్రెస్ తెచ్చిన కరువు కాదన్నారు. ముఖ్యమంత్రి చెప్పిన విధంగా ప్రజలందరూ కరెంట్, నీళ్ళు పొదుపుగా వాడాలన్నారు. రాష్ట్రంలో ఎక్కడ కూడా గుడిసెలు లేకుండా చూస్తున్నామని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కనుగునముగా అర్హత ఉన్న వారందరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్నారు. ప్రభుత్వ స్థలాలను ఎవరు కబ్జా చేయడానికి వీలు లేదని, ఆ స్థలాలను ప్రభుత్వం అవసరాలకు ఉపయోగిస్తుందన్నారు.




