Husnabad: హుస్నాబాద్లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు: పొన్నం హాజరు
Husnabad: హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు కట్ట వద్ద సద్దుల బతుకమ్మ సంబరాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ మహిళలతో కలిసి ఆడారు. వర్షాలు కురవాలని గౌరమ్మను వేడుకోవాలని కోరారు.
Husnabad: హుస్నాబాద్లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు: పొన్నం హాజరు
హుస్నాబాద్: హుస్నాబాద్ పట్టణంలోని ఎల్లమ్మ చెరువు కట్ట వద్ద సద్దుల బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని మహిళలు, ఆడపడుచులతో కలిసి బతుకమ్మ ఆడుతూ పండుగ సంబరాల్లో భాగస్వాములయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
బతుకమ్మ పండుగ సందర్భంగా గౌరమ్మను పూజిస్తూ రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించాలని మహిళలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులందరూ పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని, ప్రతి కుటుంబంలో సంతోషం వెల్లివిరియాలని అమ్మవారిని వేడుకోవాలని కోరారు.
ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే ఆందోళన ఉందని, మన రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసినప్పటికీ వ్యవసాయానికి అవసరమైన సమృద్ధి వర్షాలు కురవాలని ఆకాంక్షించారు. రైతులు పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ సంతోషంగా జీవించాలని గౌరమ్మను ప్రార్థించాలని సూచించారు.
బతుకమ్మ ఆడుతూ, పాటలు పాడుతూ తమ కుటుంబ సభ్యుల శ్రేయస్సును కోరుకునే మహిళలు సమాజంలోని ప్రతి ఒక్కరూ బాగుండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కూడా ప్రార్థించాలని అన్నారు.
రంగురంగుల పూలతో ప్రకృతిని ఆరాధిస్తూ జరుపుకునే బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని పేర్కొన్నారు. మహిళలు, ఆడపడుచులు అందరూ కలిసి ఆనందోత్సాహాలతో బతుకమ్మ పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్, మున్సిపల్ చైర్మన్ దండి లక్ష్మీ, వైస్ చైర్మన్ చిత్తారి పద్మ, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, అధికారులు, మహిళలు, ఆడపడుచులు తదితరులు పాల్గొన్నారు.




