Husnabad: ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ నిర్లక్ష్యం బీఆర్ఎస్
Husnabad: ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా కొనుగోళ్లు సక్రమంగా జరగక రైతులు ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకుని నష్టపోతున్నారని బీఆర్ఎస్ నేత మల్లికార్జున్ రెడ్డి ఆరోపించారు.
Husnabad: ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ నిర్లక్ష్యం బీఆర్ఎస్
హుస్నాబాద్: ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినప్పటికీ కొనుగోళ్లు సక్రమంగా జరగకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని బీఆర్ఎస్ హుస్నాబాద్ నియోజకవర్గ అధికార ప్రతినిధి అయిలేని మల్లికార్జున రెడ్డి ఆరోపించారు. సోమవారం హుస్నాబాద్ మండలం కూచనపల్లి గ్రామంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి దాదాపు మూడు వారాలు కావస్తున్నా కొనుగోళ్లు ఆశించిన స్థాయిలో జరగడం లేదన్నారు.
దీంతో రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు వ్యాపారులకు తక్కువ ధరకు ధాన్యం విక్రయిస్తూ నష్టపోతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే వేలాది క్వింటాళ్ల ధాన్యం మిల్లులకు చేరిందని, కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వం ఇప్పటివరకు ఎంత ధాన్యం సేకరించిందో స్పష్టంగా వెల్లడించాలని డిమాండ్ చేశారు. రైతులు పెట్టుబడులు పెట్టి కష్టపడి పండించిన పంటను గిట్టుబాటు ధరకు విక్రయించుకునే పరిస్థితి లేకుండా పోయిందన్నారు.
ఒకవైపు విద్యుత్ కోతలు, మరోవైపు బోర్లు, బావుల్లో నీటి కొరతతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. ఇన్ని కష్టాలకోర్చి పండించిన కొద్దిపాటి పంటను కూడా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించుకోలేక నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రచార ఆర్భాటాలకు ప్రాధాన్యం ఇస్తోందని, బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేయడం తప్ప రైతులకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు.
ఇప్పటికైనా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించి, వేగంగా ధాన్యం కొనుగోళ్లు చేపట్టి రైతులకు న్యాయం చేయాలని కోరారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అయిలేని గాల్ రెడ్డి, అయిలేని రవీందర్ రెడ్డి, గుళ్ల పైడిద్ద రాజు, నిరటి రవీందర్, మాటూరి రాజశేఖర్ గౌడ్, కేసిరెడ్డి ప్రతాప్ రెడ్డి, మామిడి రాములు తదితరులు పాల్గొన్నారు.




