Gajwel: హెచ్‌ఎంటీవీ వార్తకు స్పందన: వాసవి నగర్‌లో చెత్త తొలగింపు
Gajwel: గజ్వేల్ మున్సిపాలిటీ 2వ వార్డు వాసవి నగర్‌లో చెత్త సమస్యపై హెచ్‌ఎంటీవీ ప్రచురించిన వార్తకు స్పందించి కౌన్సిలర్ గోలి మమత సంతోష్ చెత్తను తొలగింపజేశారు.
Gajwel: హెచ్‌ఎంటీవీ వార్తకు స్పందన: వాసవి నగర్‌లో చెత్త తొలగింపు
గజ్వేల్: ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో మీడియా పాత్ర మరోసారి నిరూపితమైంది. గజ్వేల్ పట్టణంలోని రెండో వార్డు వాసవి నగర్‌లో పేరుకుపోయిన చెత్త తో కాలనీవాసులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై హెచ్‌ఎంటీవీ వెబ్ న్యూస్ లో ప్రచురితమైన వార్తకు సానుకూల స్పందన లభించింది. వార్త ప్రచురితమైన వెంటనే రెండో వార్డు కౌన్సిలర్ గోలి మమత సంతోష్ స్పందించి, చెత్తను తొలగించేలా చర్యలు తీసుకున్నారు.
కాలనీలో పారిశుద్ధ్యం కొరవడటం, ఖాళీ స్థలంలో చెత్త పేరుకుపోవడం తో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితిని హెచ్‌ఎంటీవీ వార్త వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ సమస్యను గుర్తించిన కౌన్సిలర్ వెంటనే స్పందించి చెత్త తొలగింపునకు చర్యలు చేపట్టడంతో కాలనీవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రజా సమస్యల పరిష్కారంలో చొరవ అభినందనీయం!
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై తక్షణమే స్పందించి పరిష్కారానికి కృషి చేయడం ప్రజాప్రతినిధుల బాధ్యతకు నిదర్శనమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. వార్తను చూసిన వెంటనే స్పందించి పారిశుద్ధ్య పనులు చేపట్టించిన కౌన్సిలర్ గోలి మమత సంతోష్ చొరవను కాలనీవాసులు అభినందిస్తున్నారు.
ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి దోహదపడిన హెచ్‌ఎంటీవీ వార్తా కథనంపై కూడా స్థానికులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు ఇదే విధంగా నిరంతరం స్పందిస్తూ వార్డులో పారిశుద్ధ్య నిర్వహణకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కోరుతున్నారు.
ప్రజా సమస్యపై మీడియా కథనం.. ప్రజాప్రతినిధి తక్షణ స్పందన.. సమస్య పరిష్కారంతో కాలనీవాసుల్లో ఆనందం!




