Gajwel: నిర్వాసితుల సమస్యలు తీర్చకపోతే సీఎం సభను అడ్డుకుంటాం
Gajwel: మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ ముంపు నిర్వాసితుల సమస్యలను నవంబర్ 19లోగా పరిష్కరించాలని, లేనిచో సీఎం సభను అడ్డుకుంటామని వంటేరు ప్రతాప్‌రెడ్డి హెచ్చరించారు.
Gajwel: నిర్వాసితుల సమస్యలు తీర్చకపోతే సీఎం సభను అడ్డుకుంటాం
గజ్వేల్: మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ ప్రాజెక్టుల ముంపు గ్రామాల భూ నిర్వాసితులకు పెండింగ్‌లో ఉన్న పరిహార ప్యాకేజీలతో పాటు ప్లాట్లను తక్షణమే కేటాయించాలని గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నెల 19న సిద్ధిపేటలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్వహించనున్న బహిరంగ సభలోగా నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. మంగళవారం గజ్వేల్‌లోని తన క్యాంపు కార్యాలయంలో భూ నిర్వాసితులతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో సిద్ధిపేట జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ ప్రాజెక్టుల కోసం భూములు, ఇళ్లు, ఆస్తులు త్యాగం చేసిన నిర్వాసితులకు ఇప్పటికీ పూర్తిస్థాయిలో న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్‌లో ఉన్న పరిహార ప్యాకేజీలు, పునరావాస ప్లాట్లను వెంటనే కేటాయించి బాధితులకు న్యాయం చేయాలని కోరారు.
గతంలో టీడీపీలో ఉన్న సమయంలో మల్లన్నసాగర్ ముంపు బాధితుల పక్షాన రెండు రోజులపాటు దీక్ష చేసిన రేవంత్‌రెడ్డి, ప్రస్తుతం ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పటికీ వారి సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వాసితులకు పలు ప్యాకేజీలు అందించారని, ఇంకా పరిష్కారం కాని సమస్యలను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు.
ఈ నెల 19లోగా ముంపు గ్రామాల నిర్వాసితుల సమస్యలను పరిష్కరించకపోతే సిద్ధిపేటలో నిర్వహించే ముఖ్యమంత్రి బహిరంగ సభను అడ్డుకుంటామని హెచ్చరించారు. పోలీసులను అడ్డుపెట్టుకున్నా వెనక్కి తగ్గేది లేదని, సభా వేదికపైనే ముఖ్యమంత్రిని నిర్వాసితుల సమస్యలపై నిలదీస్తామని స్పష్టం చేశారు.
అలాగే, కేసీఆర్ హయాంలో గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం కేటాయించిన రూ.180 కోట్ల నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిందని ఆరోపించారు. ఆ నిధులను వెంటనే విడుదల చేసి పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సిద్ధిపేట పర్యటన సందర్భంగా జిల్లాలో నెలకొన్న కరువు పరిస్థితులు, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ నిర్వాసితుల సమస్యలు, గజ్వేల్ అభివృద్ధి నిధుల అంశాలపై స్పష్టమైన ప్రకటన చేయాలని వంటేరు ప్రతాప్‌రెడ్డి కోరారు.




