Gajwel: మల్లన్నసాగర్ బాధితులకు న్యాయం చేయకుంటే సీఎం సభ అడ్డుకుంటాం
Gajwel: మల్లన్నసాగర్ ముంపు బాధితుల పెండింగ్ పరిహారం చెల్లించాలని, లేనిచో నవంబర్ 19న సిద్దిపేటలో జరిగే సీఎం సభను అడ్డుకుంటామని టీఆర్పీ నేతలు హెచ్చరించారు.
Gajwel: మల్లన్నసాగర్ బాధితులకు న్యాయం చేయకుంటే సీఎం సభ అడ్డుకుంటాం
గజ్వేల్: మల్లన్నసాగర్ ప్రాజెక్టు ముంపు బాధితులకు ప్రభుత్వం తక్షణమే న్యాయం చేయాలని, లేకుంటే ఈ నెల 19న సిద్దిపేట జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిర్వహించనున్న సభను అడ్డుకుంటామని తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టిఆర్పి) నాయకులు హెచ్చరించారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం భూములు, ఇళ్లు, జీవనాధారాలను కోల్పోయిన నిర్వాసితులకు ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీల మేరకు పూర్తి స్థాయిలో పరిహారం, పునరావాస ప్యాకేజీలు అందించాలని డిమాండ్ చేశారు.
ఈ మేరకు గజ్వేల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో టిఆర్పి నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం సర్వస్వం త్యాగం చేసిన నిర్వాసితులు నేటికీ అనేక సమస్యలతో సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులైన బాధితులకు అందాల్సిన పరిహారం, పునరావాస ప్యాకేజీలు పూర్తిస్థాయిలో అందకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సిద్దిపేట జిల్లాలో సభ నిర్వహించడానికి ముందే మల్లన్నసాగర్ ముంపు బాధితుల సమస్యలపై దృష్టి సారించాలని కోరారు. పెండింగ్లో ఉన్న పరిహారాన్ని వెంటనే విడుదల చేయడంతో పాటు, పునరావాసానికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేవలం సభలు, సమావేశాలకే పరిమితం కాకుండా, ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోని నిర్వాసితుల సమస్యలకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పరిష్కారం చూపాలని అన్నారు.
ఈ నెల 19వ తేదీలోగా ముంపు బాధితులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని, లేనిపక్షంలో ముఖ్యమంత్రి సభను అడ్డుకుంటామని హెచ్చరించారు. బాధితులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో టిఆర్పి సిద్దిపేట జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటేష్, జిల్లా మైనారిటీ అధ్యక్షుడు సయ్యద్ బాబా, జిల్లా సహాయ కార్యదర్శి గాలింక స్వామి, జిల్లా ఉపాధ్యక్షులు మొహమ్మద్ పాషా, పి. నర్సింగ్, కార్యవర్గ సభ్యుడు మహేష్ తదితరులు పాల్గొన్నారు.




