Gajwel: గజ్వేల్‌లో చాకలి ఐలమ్మ జయంతి: ఎంపీ రఘునందన్ రావు నివాళి

Gajwel: గజ్వేల్ పట్టణంలో వీరనారి చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకల్లో ఎంపీ రఘునందన్ రావు పాల్గొని నివాళులర్పించారు; చెరువు పనుల నాణ్యతపై మండిపడ్డారు.

MEER OSMAN ALI KHAN, GAJEWL
Published on: 26 Sept 2026 8:48 PM IST
Gajwel
X

Gajwel: గజ్వేల్‌లో చాకలి ఐలమ్మ జయంతి: ఎంపీ రఘునందన్ రావు నివాళి

సిద్దిపేట జిల్లా: గజ్వేల్ పట్టణంలో తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి మెదక్ జిల్లా ఎంపీ రఘునందన్ రావు ముఖ్య అతిథిగా హాజరై, చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ మట్టిలో పుట్టిన పౌరుషాన్ని, పోరాట పటిమను ప్రపంచానికి చాటిచెప్పిన వీరనారి చాకలి ఐలమ్మ అని కొనియాడారు. "ఏ వీధిలో, ఏ చౌరస్తాలో తెలంగాణ కోసం పోరాటం జరిగినా కొమురం భీమ్, దొడ్డి కొమురయ్యలతో పాటు చాకలి ఐలమ్మ పేరును ప్రతీ ఒక్కరూ స్మరించుకుంటారు. పూర్వం ఎలాంటి వార్తా సమాచార వ్యవస్థలు, టీవీలు, సోషల్ మీడియా లేని రోజుల్లోనే.. తన భూమిని దక్కకుండా చేయాలని చూసిన ఊరి జమీందార్లను, నిజాం సర్కార్‌ను సైతం గట్టిగా నిలదీసి తన హక్కుల కోసం పోరాడిన ధీర వనిత ఐలమ్మ" అని పేర్కొన్నారు.

మలిదశ తెలంగాణ ఉద్యమంలో 'జై తెలంగాణ' అని నినదించిన ప్రతిసారీ, ఐలమ్మ నాయకత్వం వర్ధిల్లాలని స్మరించుకున్నామని గుర్తుచేశారు. గజ్వేల్ పట్టణంలో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమని, ఆమె ఆశయాలను, పోరాట పటిమను భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.

పాండవుల చెరువు పనులపై అసంతృప్తి:

ఇదే సందర్భంలో స్థానిక పాండవుల చెరువు సుందరీకరణ పనులపై ఎంపీ స్పందిస్తూ.. నిర్మాణ పనుల్లో నాణ్యత లోపించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పనులను నాణ్యతా ప్రమాణాలతో చేపట్టాలని అధికారులను, కాంట్రాక్టర్లను హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

MEER OSMAN ALI KHAN, GAJEWL

MEER OSMAN ALI KHAN, GAJEWL