Gajwel: హామీల అమలులో కాంగ్రెస్ విఫలమైందన్న ఎంపీ రఘునందన్

Gajwel: ఎన్నికల హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, కేవలం కొడంగల్ అభివృద్ధిపైనే దృష్టి సారిస్తోందని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు విమర్శించారు.

Osman Pathan, GAJEWL
Published on: 17 Nov 2026 9:56 PM IST
Gajwel
X

Gajwel: హామీల అమలులో కాంగ్రెస్ విఫలమైందన్న ఎంపీ రఘునందన్

గజ్వేల్: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజాపాలన పేరుతో ప్రజలను మభ్యపెడుతూ మోసం చేస్తోందని మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్‌రావు తీవ్రస్థాయిలో విమర్శించారు. ఇంటింటా సౌభాగ్యం తీసుకొస్తామని చెప్పిన కాంగ్రెస్ పాలనలో ప్రజలకు సౌభాగ్యం కంటే దారిద్య్రం, కష్టాలే ఎక్కువయ్యాయని ఎద్దేవా చేశారు.

సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలను సమానంగా అభివృద్ధి చేయాల్సిన ప్రభుత్వం కేవలం కొడంగల్‌పైనే ప్రత్యేక దృష్టి సారిస్తూ మిగతా ప్రాంతాలను విస్మరిస్తోందని ఆరోపించారు. కొడంగల్ అభివృద్ధికి రూ.9 వేల కోట్లు కేటాయిస్తూ ఇతర నియోజకవర్గాల అభివృద్ధిని పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో పత్రాలను చింపి చెత్తబుట్టలో వేసి నిరసన వ్యక్తం చేశారు.

సిద్దిపేట జిల్లా అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పలు అంశాలతో ప్రభుత్వానికి వినతిపత్రాలు అందించినప్పటికీ నేటికీ ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదని అన్నారు. గజ్వేల్ పట్టణ శివారులోని కిలోమీటర్ రింగ్ రోడ్డు పనులను ఇప్పటికీ పూర్తి చేయలేదని, సుమారు రూ.3 కోట్లతో నిర్మిస్తున్న ప్రజ్ఞాపూర్ బస్టాండ్ పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయని పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.

అభివృద్ధి విషయంలో కొడంగల్‌ను కుడికన్నుగా భావిస్తే, దుబ్బాకను ఎడమ కన్నుగా చూసి సమానంగా అభివృద్ధి చేయాలని కోరితే.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రెండు కళ్లూ మూసుకుని పాలన సాగిస్తున్నారని ఘాటుగా విమర్శించారు.

జిల్లా ప్రజలకు మల్లన్న సాగర్ జలాశయం ఉన్నప్పటికీ స్థానిక ప్రజలకు సాగునీరు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు యాదాద్రి భువనగిరి జిల్లాకు మల్లన్న సాగర్ నీటిని అందిస్తామని హామీలు ఇవ్వడం ప్రజలను మభ్యపెట్టడమేనని అన్నారు. హైదరాబాద్ నడిబొడ్డున నిర్మిస్తామని ప్రకటించిన స్కైవాక్ పనులపై ప్రభుత్వం నుంచి ఎలాంటి పురోగతి కనిపించడం లేదని, స్కైవాక్ హామీ గాలిలో కలిసిపోయిందంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్, మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, ఎలకంటి సురేష్‌తో పాటు పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Osman Pathan, GAJEWL

Osman Pathan, GAJEWL