Gajwel: గజ్వేల్ పోలీస్ స్టేషన్‌లో రైతుపై ఎస్‌ఐ దాడి బాధితుడి ఆవేదన!
Gajwel: గజ్వేల్‌లో పొలం వివాదంపై ఫిర్యాదుకు వెళ్లిన రైతు బీమరి రవిపై ఎస్‌ఐ మల్లారెడ్డి దాడి చేశారంటూ ఆరోపణలు. ఉన్నతాధికారుల విచారణకు డిమాండ్.
Gajwel: గజ్వేల్ పోలీస్ స్టేషన్‌లో రైతుపై ఎస్‌ఐ దాడి బాధితుడి ఆవేదన!
గజ్వేల్: న్యాయం కోసం పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన తనపై ఎస్‌ఐ దాడి చేశారని ఓ రైతు ఆరోపించడం గజ్వేల్‌లో చర్చనీయాంశంగా మారింది. తన వ్యవసాయ పొలంలో పంట సాగు విషయంలో పొరుగువారితో తలెత్తిన వివాదంపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా, ఎస్‌ఐ మల్లారెడ్డి తనపై దాడి చేసి గాయపరిచారని బాధితుడు బీమరి రవి (35) ఆరోపించారు.
బాధితుడి వివరాల ప్రకారం.. గజ్వేల్‌కు చెందిన బీమరి రవి, తండ్రి యాదయ్య, వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. తన వ్యవసాయ పొలంలో పంట సాగు విషయంలో పొరుగువారితో వివాదం తలెత్తడంతో న్యాయం చేయాలని కోరుతూ శుక్రవారం సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో గజ్వేల్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లినట్లు తెలిపారు.
ఈ క్రమంలో ఎస్‌ఐ మల్లారెడ్డి ఎలాంటి కారణం లేకుండా తనపై దాడి చేశారని, రక్తం వచ్చేలా కొట్టారని రవి ఆరోపించారు. తనకు న్యాయం చేయాల్సిన పోలీసులే తనపై దాడి చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని బాధితుడు కోరుతున్నట్లు తెలిసింది.
అయితే, ఈ ఘటనకు సంబంధించి పోలీసుల అధికారిక వివరణ తెలియాల్సి ఉంది. ఆరోపణలపై విచారణ అనంతరం వాస్తవాలు వెల్లడికావాల్సి ఉంది.




