Gajwel: ఏడుపాయల నుంచి పాదయాత్రకు వంటేరు ఘన స్వాగతం

Gajwel: కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని ఏడుపాయల నుంచి గజ్వేల్ వరకు చేపట్టిన పాదయాత్రకు వంటేరు ప్రతాప్‌రెడ్డి ఘన స్వాగతం పలికి, ప్రస్తుత పాలనపై విమర్శలు చేశారు.

Osman Pathan, GAJEWL
Published on: 19 Nov 2026 7:02 PM IST
Gajwel
X

Gajwel: ఏడుపాయల నుంచి పాదయాత్రకు వంటేరు ఘన స్వాగతం

గజ్వేల్: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ మెదక్ జిల్లా ఏడుపాయల నుంచి చేపట్టిన పాదయాత్ర గజ్వేల్‌కు చేరుకుంది. గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకున్న పాదయాత్ర బృందానికి గజ్వేల్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ ఇన్‌చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి ఘనంగా స్వాగతం పలికి, శాలువాలతో సత్కరించారు.

మెదక్ జిల్లాకు చెందిన కుమార్‌గౌడ్, కొండల్‌రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 25 మంది బీఆర్‌ఎస్ నాయకులు ఏడుపాయల వనదుర్గామాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పాదయాత్రను ప్రారంభించారు. వారం రోజులపాటు కొనసాగిన ఈ పాదయాత్రలో వివిధ గ్రామాలు, పట్టణాల్లో పర్యటిస్తూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను, కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో నెలకొన్న పరిస్థితులను తెలుసుకుంటూ గజ్వేల్‌కు చేరుకున్నారు.

ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్‌రెడ్డి పాదయాత్ర బృందానికి అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మూడేళ్ల పాలనలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రాష్ట్రంలోని గ్రామాలు, పట్టణాలు, వీధుల్లో ఎక్కడ చూసినా ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారని ఆరోపించారు.

కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో కరువు పరిస్థితులు నెలకొని రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ముఖ్యమంత్రికి పట్టడం లేదని విమర్శించారు. అవినీతి, అక్రమాలు, భూకబ్జాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, హైడ్రా పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్లను నింపి, కూడవెల్లి వాగు, హల్దీ వాగులతో పాటు రామాయంపేట, సంగారెడ్డి, జగదేవ్‌పూర్ కాలువలకు సాగునీరు విడుదల చేశారని గుర్తుచేశారు.

దీంతో ప్రతి ఎకరా పచ్చని పంటలతో కళకళలాడిందన్నారు. ప్రస్తుతం ప్రాజెక్టుల్లో నీటిని నిల్వ చేయకపోవడం, కాలువలకు సాగునీరు విడుదల చేయకపోవడంతో వ్యవసాయ భూములు ఎండిపోతున్నాయని విమర్శించారు. కేసీఆర్ పాలనలో నదులు, వాగులు జీవనదులుగా మారితే.. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో సాగునీరు లేక భూములు బీడువారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని, గ్రామాలు, పట్టణాల్లో ఎక్కడికి వెళ్లినా కేసీఆర్ పాలన తిరిగి రావాలనే ఆకాంక్ష వ్యక్తమవుతోందని అన్నారు.

కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలనే సంకల్పంతో పలువురు పాదయాత్రలు, సైకిల్ యాత్రలు చేపడుతున్నారని తెలిపారు. ఈ యాత్రల ద్వారా ప్రజా సమస్యలను, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులను కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు.

రాష్ట్రంలో ఇప్పటికీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదని, పత్తి కొనుగోళ్లకు సంబంధించి సీసీఐ కేంద్రాలు కూడా అందుబాటులోకి రాలేదని విమర్శించారు. రైతుల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడుతోందని, ప్రజలకు భరోసా కరువైందని వంటేరు ప్రతాప్‌రెడ్డి ఆరోపించారు.

ఈ కార్యక్రమంలో గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్‌పర్సన్ గంగిశెట్టి చందన రవీందర్, కౌన్సిలర్లు బొగ్గుల స్వప్న సురేష్, మన్నె రూపా వెంకటేష్, కొలిచెల్మి భవాని కరుణాకర్, కప్ప మమత పోచయ్య, మరికంటి కనకసేన, రాయపోల్ మాజీ సర్పంచ్ రాజిరెడ్డి, నాయకులు అహ్మద్, శివతో పాటు పలువురు బీఆర్‌ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Osman Pathan, GAJEWL

Osman Pathan, GAJEWL