Gajwel: డ్రంక్ అండ్ డ్రైవ్: 30 మందికి జైలు శిక్ష విధించిన గజ్వేల్ కోర్టు!

Gajwel: గజ్వేల్ కోర్టు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో 30 మందికి జైలు శిక్ష విధించడంతో పాటు రూ.45 వేల జరిమానా విధించింది. సీపీ రష్మీ పెరుమాళ్ నిబంధనలపై హెచ్చరించారు.

MEER OSMAN ALI KHAN, GAJEWL
Published on: 11 Nov 2026 9:59 PM IST
Gajwel
X

Gajwel: డ్రంక్ అండ్ డ్రైవ్: 30 మందికి జైలు శిక్ష విధించిన గజ్వేల్ కోర్టు!

గజ్వేల్: మద్యం సేవించి వాహనాలు నడపడం, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ప్రయాణించడం వంటి ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై నమోదైన కేసుల్లో గజ్వేల్ కోర్టు కఠిన చర్యలు చేపట్టింది. బుధవారం గజ్వేల్ ప్రిన్సిపల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో మొత్తం 35 కేసులను పరిష్కరించగా, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో 30 మందికి ఒకటి నుంచి ఐదు రోజుల వరకు జైలు శిక్ష విధించింది. మరో ఐదు కేసుల్లో మొత్తం రూ.45 వేల జరిమానా విధించింది.

గజ్వేల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై నమోదైన 34 కేసుల్లో నాలుగు కేసులకు సంబంధించి ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున మొత్తం రూ.40 వేల జరిమానా విధించారు. మిగిలిన 30 కేసుల్లో నిందితులకు జైలు శిక్ష ఖరారు చేశారు. వీరిలో ఎనిమిది మందికి ఒక రోజు, ఏడుగురికి రెండు రోజులు, నలుగురికి మూడు రోజులు, ఏడుగురికి నాలుగు రోజులు, మరో నలుగురికి ఐదు రోజుల చొప్పున శిక్ష విధించారు. అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపిన ఒకరికి రూ.5 వేల జరిమానా విధించారు. దీంతో మొత్తం జరిమానా రూ.45 వేలకు చేరింది.

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్, ఐపీఎస్ మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనం నడపడం నేరమేకాకుండా, సొంత ప్రాణాలతో పాటు ఇతరుల జీవితాలకు కూడా తీవ్ర ముప్పు కలిగిస్తుందని హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. రాంగ్‌రూట్‌లో ప్రయాణించడం, ట్రిపుల్ రైడింగ్, అతివేగం ప్రమాదాలకు ప్రధాన కారణాలవుతున్నాయని పేర్కొన్నారు.

మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని, ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని స్పష్టం చేశారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవడమే ప్రతి ఒక్కరి లక్ష్యం కావాలని, రోడ్డు భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు.

MEER OSMAN ALI KHAN, GAJEWL

MEER OSMAN ALI KHAN, GAJEWL