Gajwel: చిల్లర రాజకీయాలు మానుకో ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ నాయకుల విమర్శ

Gajwel: గజ్వేల్ కూరగాయల మార్కెట్ కార్మికుల జీతాలపై వంటేరు ప్రతాప్ రెడ్డి చిల్లర రాజకీయాలు మానుకోవాలని కాంగ్రెస్ నేతలు నరేందర్ రెడ్డి, సర్దార్ ఖాన్ విమర్శ.

MEER OSMAN ALI KHAN, GAJEWL
Published on: 22 Oct 2026 6:36 PM IST
Gajwel
X

Gajwel: చిల్లర రాజకీయాలు మానుకో ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ నాయకుల విమర్శ

గజ్వేల్: సమీకృత కూరగాయల మార్కెట్‌లో పనిచేస్తున్న రోజువారీ కూలీల వేతనాల విషయంలో బీఆర్‌ఎస్ నాయకుడు వంటేరు ప్రతాప్ రెడ్డి వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడటం సరికాదని కాంగ్రెస్ నాయకులు నరేందర్ రెడ్డి, సర్దార్ ఖాన్ విమర్శించారు. మార్కెట్ కార్మికులకు ఆరు నెలలుగా వేతనాలు అందడం లేదంటూ ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మార్కెట్ కార్మికులకు సంబంధించి కేవలం ఆగస్టు, సెప్టెంబర్ నెలల వేతనాలు మాత్రమే బకాయి ఉన్నాయని తెలిపారు. ప్రతాప్ రెడ్డి మార్కెట్‌ను సందర్శించడానికి ముందే జూన్, జూలై నెలలకు సంబంధించిన వేతనాలను వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి కార్మికులకు చెల్లించారని పేర్కొన్నారు. వాస్తవాలను తెలుసుకోకుండా ఆరు నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదంటూ ఆరోపణలు చేయడం రాజకీయ లబ్ధి కోసం చేస్తున్న ప్రయత్నమని విమర్శించారు.

గజ్వేల్ ప్రజలు ఎమ్మెల్యేను ఎన్నుకున్నారని, మార్కెట్ కార్మికుల సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే సంబంధిత జిల్లా కలెక్టర్‌తో పాటు ఉన్నతాధికారులతో మాట్లాడి చర్యలు తీసుకోవాలని సూచించారు. మార్కెట్‌ను సందర్శించి విమర్శలు చేయడం కంటే కార్మికుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా కృషి చేయాలని అన్నారు.

గజ్వేల్ సమీకృత మార్కెట్ నిర్మాణం కోసం ఇతర మార్కెట్ల నుంచి రూ.10.70 కోట్ల అప్పులు తీసుకుని నిర్మాణం చేపట్టారని, అయితే అక్కడ పనిచేస్తున్న కార్మికులకు శాశ్వత వేతన వనరులు కల్పించకుండా రోజువారీ కూలీలుగానే కొనసాగించడం దురదృష్టకరమని వారు పేర్కొన్నారు. ఇదే సమయంలో సిద్దిపేటలో రైతుబజార్‌లో పనిచేసే వారికి కలెక్టర్ ద్వారా వేతనాలు అందించే ఏర్పాట్లు ఉన్నాయని, గజ్వేల్ మార్కెట్ కార్మికులకు కూడా అలాంటి సదుపాయం ఎందుకు కల్పించడం లేదని ప్రశ్నించారు.

మార్కెట్ కార్మికులకు సకాలంలో వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నది వాస్తవం కాదా అని ప్రశ్నించిన కాంగ్రెస్ నాయకులు, ఈ సమస్యకు బాధ్యత వహించి పరిష్కారం చూపాల్సిన అవసరం ఎమ్మెల్యేపై ఉందన్నారు. గజ్వేల్ ప్రజలు, కార్మికుల సమస్యలను పట్టించుకోకుండా రాజకీయ విమర్శలకు దిగితే ప్రజలే తగిన సమాధానం చెబుతారని హెచ్చరించారు.

MEER OSMAN ALI KHAN, GAJEWL

MEER OSMAN ALI KHAN, GAJEWL