Husnabad: లైసెన్సుల్లేని కొనుగోళ్లపై చర్యలు తీసుకోవాలి!

Husnabad: హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

SRINIVAS, HUSNABAD
Published on: 11 Nov 2026 5:40 PM IST
Husnabad
X

Husnabad: లైసెన్సుల్లేని కొనుగోళ్లపై చర్యలు తీసుకోవాలి!

Husnabad: రైతుల ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తూ మార్కెట్‌ కమిటీ పరిధిలో లైసెన్సులు లేకుండా వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్న వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు కొమ్ముల భాస్కర్‌ డిమాండ్‌ చేశారు.

అక్రమ కొనుగోళ్లను అరికట్టడంలో మార్కెట్‌ కమిటీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బుధవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ కార్యాలయం ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం మార్కెట్‌ కమిటీ కార్యదర్శి నాగరాజుకు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా కొమ్ముల భాస్కర్‌ మాట్లాడుతూ.. మార్కెట్‌ పరిధిలో కొందరు వ్యాపారులు వడ్లు, మొక్కజొన్న, పత్తి, అపరాలను ఎలాంటి అనుమతులు, లైసెన్సులు లేకుండానే బహిరంగంగా కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు.

నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారాలు సాగిస్తున్న వారిపై అధికారులు చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నదన్నారు. మార్కెట్‌లో జరిగే ప్రతి కొనుగోలు, అమ్మకంపై అధికారులు పర్యవేక్షణ చేయాలని కోరారు.

సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు జేరిపోతుల జనార్దన్‌ మాట్లాడుతూ.. ఆరుగాలం శ్రమించి పంటలు పండిస్తున్న రైతుల ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. లైసెన్సులు లేకుండా కొనుగోళ్లు చేస్తున్న వ్యాపారులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అధికారులు స్పందించకుంటే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్‌ సభ్యుడు ముంజ గోపి, పట్టణ కార్యదర్శి ఎగ్గొజు సుదర్శన చారి, నాయకులు ఎనగందుల లక్ష్మీనారాయణ, మాడిశెట్టి శ్రీధర్‌, వేల్పుల ప్రసన్న కుమార్‌, మాచర్ల శ్రీనివాస్‌, బైరగొని శ్రీనివాస్‌, బోయిని సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

SRINIVAS, HUSNABAD

SRINIVAS, HUSNABAD