Gajwel: అంకిరెడ్డిపల్లిలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాపై కాంగ్రెస్ ప్రచారం!

Gajwel: గజ్వేల్ నియోజకవర్గం కొండపాక మండలం అంకిరెడ్డిపల్లిలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై కాంగ్రెస్ నేతలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

Osman Pathan, GAJEWL
Published on: 28 Nov 2026 11:42 AM IST
Gajwel
X

Gajwel: అంకిరెడ్డిపల్లిలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాపై కాంగ్రెస్ ప్రచారం!

Gajwel: గజ్వేల్ నియోజకవర్గం కొండపాక మండలం అంకిరెడ్డిపల్లి గ్రామంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గ్రామ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో నాయకులు ప్రతి ఇంటికి వెళ్లి పథకం వివరాలను ప్రజలకు వివరించారు.

కరపత్రాలను పంపిణీ చేస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరూ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ గజవెల్లి సుదర్శన్ మాట్లాడుతూ ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రవేశపెట్టడం అభినందనీయమన్నారు.

దేశంలోనే తొలిసారిగా కుటుంబ జీవిత బీమా పథకానికి శ్రీకారం చుట్టడం గొప్ప విషయమని పేర్కొన్నారు. దేశ ప్రజలనే తన కుటుంబంగా భావించి, జీవితాన్ని దేశ సేవకు అంకితం చేసిన మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ పేరు మీద ఈ పథకాన్ని ప్రారంభించడం సంతోషకరమన్నారు.

ఉక్కు మహిళగా, హరిత విప్లవానికి మార్గదర్శకురాలిగా, ‘గరీబీ హఠావో’ నినాదంతో పేదలు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి విశేష కృషి చేసిన ఇందిరాగాంధీ సేవలను కొనియాడారు. కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉండే వ్యక్తి అకాల మరణం చెందితే ఆ కుటుంబం ఎదుర్కొనే ఆర్థిక ఇబ్బందులను తగ్గించి, భరోసా కల్పించడంలో ఈ పథకం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.

గ్రామంలోని ప్రతి కుటుంబం పథకంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, అర్హత కలిగిన వారు నమోదు చేసుకుని ప్రభుత్వ పథకం ద్వారా లబ్ధి పొందాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు శిఖా అఖిల్ గౌడ్‌తో పాటు దృగుణాల కిషన్ రావు, జక్కుల నరసింహులు, తాళ్లపల్లి రాజు తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Osman Pathan, GAJEWL

Osman Pathan, GAJEWL