Siddipet: పదో తరగతి, ఇంటర్‌కు ఉమ్మడి బోర్డు.. 9-12 వరకు ఒకే విద్యా విధానం!

Siddipet: తెలంగాణలో 9 నుంచి 12వ తరగతి వరకు ఒకే విద్యా విధానం, పదో తరగతి, ఇంటర్‌కు ఉమ్మడి బోర్డు ఏర్పాటు దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

Osman Pathan, GAJEWL
Published on: 19 Nov 2026 1:44 PM IST
Siddipet
X

Siddipet: పదో తరగతి, ఇంటర్‌కు ఉమ్మడి బోర్డు.. 9-12 వరకు ఒకే విద్యా విధానం!

Siddipet: తెలంగాణ రాష్ట్రంలో పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలను అనుసంధానం చేస్తూ ప్రభుత్వం కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు సీనియర్ సెకండరీ విద్యా విధానాన్ని అమలు చేయాలని భావిస్తోంది.

ఇందులో భాగంగా పదో తరగతి, ఇంటర్మీడియట్ విద్యకు కలిపి ఉమ్మడి బోర్డును ఏర్పాటు చేయడంతోపాటు, 9 నుంచి 12వ తరగతి వరకు బోధించేందుకు ప్రత్యేకంగా పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ల (పీజీటీ)ను నియమించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవల నిర్వహించిన విద్యాశాఖ సమీక్షలో ఈ అంశాలపై దిశానిర్దేశం చేసినట్లు అధికార వర్గాల సమాచారం.

పీజీటీ ఉపాధ్యాయులతో బోధన

ప్రస్తుతం 10వ తరగతి వరకు డీఎస్సీ ద్వారా నియమితులైన ఉపాధ్యాయులు, ఇంటర్మీడియట్‌లో జూనియర్ అధ్యాపకులు బోధిస్తున్నారు. కొత్త విధానం అమల్లోకి వస్తే 9 నుంచి 12వ తరగతి వరకు ఒకే సబ్జెక్టును ఒకే ఉపాధ్యాయుడు బోధించే విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఇందుకోసం సంబంధిత సబ్జెక్టులో పోస్టు గ్రాడ్యుయేషన్‌తోపాటు బీఈడీ అర్హత కలిగిన పీజీటీలను నియమించే అవకాశం ఉంది. ఇప్పటికే మోడల్ స్కూళ్లు, జవహర్ నవోదయ విద్యాలయాలు, కేంద్రీయ విద్యాలయాల్లో ఇలాంటి బోధనా విధానం అమల్లో ఉంది. ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధ్యాయులు, అధ్యాపకులను కొనసాగిస్తూనే కొత్త నియామకాలు చేపట్టే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

ఒకే ఉపాధ్యాయుడు.. నాలుగేళ్ల బోధనతో ప్రయోజనాలు

9 నుంచి 12వ తరగతి వరకు ఒకే సబ్జెక్టును ఒకే ఉపాధ్యాయుడు బోధించడం వల్ల విద్యార్థులకు అనేక ప్రయోజనాలు కలుగుతాయని విద్యారంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 9, 10 తరగతుల్లో నేర్చుకున్న పాఠ్యాంశాలపై విద్యార్థులకు పట్టు ఏర్పడటంతో ఇంటర్మీడియట్‌లో ఉన్నత స్థాయి అంశాలను సులభంగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా జేఈఈ, నీట్ వంటి జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలకు పునాది దశ నుంచే సన్నద్ధమయ్యేందుకు దోహదపడుతుంది.

అలాగే విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు, బలహీనతలు, ఆసక్తులను ఉపాధ్యాయులు నాలుగేళ్లపాటు గమనించే అవకాశం ఉంటుంది. దానికి అనుగుణంగా బోధనా పద్ధతులను మార్చుకోవచ్చు. పీజీటీలకు బీఈడీ శిక్షణ ఉండటంతో విద్యార్థుల మానసిక స్థితిని అర్థం చేసుకుని బోధన సాగించేందుకు వీలుంటుందని విద్యావేత్తలు పేర్కొంటున్నారు.

పదో తరగతి, ఇంటర్‌కు ఉమ్మడి బోర్డు

ప్రస్తుతం పదో తరగతి పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల విభాగం (ఎస్‌ఎస్‌సీ బోర్డు), ఇంటర్మీడియట్ పరీక్షలను ఇంటర్మీడియట్ బోర్డు నిర్వహిస్తున్నాయి. ఈ రెండు విద్యాశాఖలను విలీనం చేస్తే ఉమ్మడి బోర్డు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు (టీజీఎస్‌ఈబీ) ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉంది. గతంలో విడుదల చేసిన రైజింగ్ తెలంగాణ దార్శనిక పత్రంలోనూ ప్రభుత్వం ఈ అంశాన్ని ప్రస్తావించింది.

ప్రస్తుతం పాఠశాల విద్యకు సంబంధించిన తెలంగాణ విద్యా చట్టం-1982, ఇంటర్మీడియట్ విద్యకు సంబంధించిన చట్టం-1971 అమల్లో ఉన్నాయి. రెండు వ్యవస్థలను ఒకే పరిధిలోకి తీసుకురావాలంటే సంబంధిత చట్టాల్లో సవరణలు చేయడంతోపాటు, అవసరమైన బిల్లులను శాసనసభలో ప్రవేశపెట్టి ఆమోదం పొందాల్సి ఉంటుంది.

పరీక్షల విధానంలో మార్పులు ఉండవు

9 నుంచి 12వ తరగతి వరకు సీనియర్ సెకండరీ విధానం అమలులోకి వచ్చినంత మాత్రాన పరీక్షల విధానంలో వెంటనే మార్పులు ఉండవని సమాచారం. ప్రస్తుతం కొనసాగుతున్న విద్యా విధానం, పరీక్షల నిర్వహణను యథావిధిగా కొనసాగించే అవకాశం ఉంది.

ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు కూడా రద్దు కావని స్పష్టమవుతోంది. భవిష్యత్తులో పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలను ఒకే సమయంలో నిర్వహించే అవకాశాలను కూడా పరిశీలించవచ్చు. అయితే దీనిపై తుది నిర్ణయం రావాల్సి ఉంది.

జూనియర్ కళాశాలలు పాఠశాల విద్య పరిధిలోకి

కొత్త విధానం అమలైతే జూనియర్ కళాశాలలు సైతం పాఠశాల విద్యాశాఖ పరిధిలోకి వస్తాయి. ఇప్పటివరకు ఇంటర్మీడియట్ బోర్డు నుంచి అనుబంధ గుర్తింపు పొందుతున్న జూనియర్ కళాశాలలు ఇకపై ప్రతిపాదిత ఉమ్మడి బోర్డు నుంచి అనుమతులు, గుర్తింపులు పొందాల్సి ఉంటుంది.

అవసరమైన అనుమతులు తీసుకుని జూనియర్ కళాశాలల్లో 9, 10 తరగతులను కూడా నిర్వహించుకునే అవకాశం ఉంటుంది. అదే విధంగా 9, 10 తరగతులున్న పాఠశాలల్లో ఇంటర్మీడియట్ విద్యను ప్రారంభించేందుకు అనుమతులు పొందవచ్చు.

ఇంటర్ డ్రాపౌట్లు తగ్గించడమే లక్ష్యం

పదో తరగతి ఉత్తీర్ణులైనప్పటికీ ఆర్థిక, సామాజిక కారణాలతో ఇంటర్మీడియట్ విద్యకు దూరమవుతున్న విద్యార్థుల సంఖ్యను తగ్గించడం ఈ విధానంలోని ప్రధాన లక్ష్యాల్లో ఒకటి. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులకు తాము చదువుతున్న పాఠశాలల్లోనే ఇంటర్మీడియట్ విద్య అందుబాటులోకి వస్తే చదువు మధ్యలో మానేసే వారి సంఖ్య తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

అంతేకాకుండా జూనియర్ కళాశాలల్లో అందుబాటులో ఉన్న సైన్స్ ప్రయోగశాలలను పాఠశాల విద్యార్థులు కూడా వినియోగించుకునే అవకాశం ఉంటుంది. సమగ్ర శిక్ష, పీఎం శ్రీ వంటి పథకాల ద్వారా నిధులు పొందేందుకు కూడా ఈ విద్యా వ్యవస్థ దోహదపడుతుందని అంచనా వేస్తున్నారు.

2027-28 నుంచి అమలుకు సన్నాహాలు

రాష్ట్రంలో 9 నుంచి 12వ తరగతి వరకు సీనియర్ సెకండరీ విద్యా విధానాన్ని 2027-28 విద్యా సంవత్సరం నుంచి తప్పనిసరిగా అమలు చేయాలనే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఈ మార్పులతో ఇంటర్మీడియట్ బోర్డు ప్రత్యేక ఉనికి మారినప్పటికీ, విద్యార్థుల పరీక్షలు, ప్రస్తుత విద్యా విధానంలో తక్షణ మార్పులు ఉండవని విద్యారంగ నిపుణులు వివరిస్తున్నారు. ప్రభుత్వ తుది విధివిధానాలు, చట్టపరమైన నిర్ణయాలు వెలువడిన తర్వాత ఈ కొత్త విద్యా వ్యవస్థపై మరింత స్పష్టత రానుంది.

సేకరణ: చిటుకుల లక్ష్మారెడ్డి, గణిత అధ్యాపకులు, శ్రీ చైతన్య విద్యాసంస్థలు, సిద్దిపేట, తెలంగాణ.

Osman Pathan, GAJEWL

Osman Pathan, GAJEWL