Siddipet: సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి సిద్దిపేట సీపీ రష్మి పెరుమాళ్!
Siddipet: సిద్దిపేట పోలీస్ కమిషనరేట్‌లో సైబర్ భద్రత అవగాహన పోస్టర్లను ఆవిష్కరించి, 'ఆగండి - ఆలోచించండి - ధృవీకరించండి' సూత్రాన్ని పాటించాలని కోరిన సీపీ రష్మి పెరుమాళ్.
Siddipet: సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి సిద్దిపేట సీపీ రష్మి పెరుమాళ్!
Siddipet: ప్రస్తుత డిజిటల్ యుగంలో పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రజలందరూ తీవ్ర అప్రమత్తతతో ఉండాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాళ్, ఐపీఎస్ గారు పిలుపునిచ్చారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో ఈ అక్టోబర్ నెలను ‘సైబర్ సెక్యూరిటీ అవేర్‌నెస్ మంత్’ (సైబర్ మోసాలపై అవగాహన మాసం) గా నిర్వహించే కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట పోలీస్ కమిషనరేట్‌లో సైబర్ క్రైమ్ అవేర్‌నెస్ పోస్టర్లను ఆమె ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సీపీ రష్మి పెరుమాళ్ మాట్లాడుతూ.. డిజిటల్ మాధ్యమాల ద్వారా జరుగుతున్న మోసాలను అరికట్టడానికి "Pause, Think, Verify" (ఆగండి… ఆలోచించండి… ధృవీకరించండి) అనే మూడంచెల విధానాన్ని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
ప్రధాన సూచనలు మరియు మార్గదర్శకాలు:
ఆగండి (Pause): అత్యవసరం, భయం లేదా ఆశ చూపే విధంగా వచ్చే ఫోన్ కాల్స్, SMSలు, WhatsApp మెసేజ్‌లు, ఈ-మెయిల్స్ లేదా అనుమానాస్పద లింకులను చూసి కంగారుపడి ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి.
ఆలోచించండి (Think): మీకు వచ్చిన సందేశం లేదా కాల్ నిజమైనదేనా? లాటరీ, అధిక లాభాలు, తక్కువ ధరలకే వస్తువులు, ఉద్యోగ అవకాశాలు, KYC అప్‌డేట్, బ్యాంక్ ఖాతా బ్లాక్ వంటి ప్రకటనలు నిజమేనా అని ప్రశ్నించుకోండి.
ధృవీకరించండి (Verify): వ్యక్తిగత వివరాలు, నగదు పంపే ముందు సంబంధిత అధికారిక వెబ్‌సైట్, కస్టమర్ కేర్ లేదా అధికారుల ద్వారా సమాచారాన్ని ధృవీకరించుకోండి.
పోలీస్ కమిషనర్ సూచనలు:
OTP, UPI PIN, ATM/డెబిట్ కార్డ్ నంబర్, CVV, నెట్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌లను ఎట్టిపరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దు. ఆన్‌లైన్ షాపింగ్‌లో అతి తక్కువ ధరలు, భారీ డిస్కౌంట్లు చూపి ఆకర్షించే నకిలీ వెబ్‌సైట్ల పట్ల జాగ్రత్తగా ఉండాలి. కొనుగోలు చేసే ముందు వెబ్‌సైట్ URL, విక్రేత వివరాలను సరిచూసుకోవాలి. అత్యవసరంగా డబ్బులు పంపాలని, లేకపోతే డిజిటల్ అరెస్ట్ చేస్తామని భయపెట్టే వ్యక్తులను, కాల్స్‌ను అస్సలు నమ్మవద్దు.
ఒకవేళ ఎవరైనా సైబర్ మోసానికి గురైతే, ఆలస్యం చేయకుండా వెంటనే ఉచిత హెల్ప్‌లైన్ నంబర్ 1930 కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని లేదా cybercrime.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని కోరారు. మొదటి "గోల్డెన్ అవర్"లో ఫిర్యాదు చేస్తే పోయిన సొమ్మును రికవరీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు.
ప్రజా చైతన్యమే సైబర్ నేరాల నివారణకు ఉత్తమ రక్షణ అని, ప్రతి పౌరుడు అప్రమత్తంగా ఉంటూ సురక్షిత డిజిటల్ సమాజాన్ని నిర్మించడంలో భాగస్వాములు కావాలని సిద్దిపేట సీపీ గారు కోరారు.




