Gajwel: భూ భారతి రీ-సర్వే పనులను పరిశీలించిన సిద్దిపేట కలెక్టర్ హైమావతి!
Gajwel: భూ సమస్యలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా చేపట్టిన భూ భారతి రీ-సర్వే పనులను సిద్దిపేట కలెక్టర్ కె. హైమావతి గజ్వేల్, వర్గల్ మండలాల్లో పరిశీలించారు.
Gajwel: భూ భారతి రీ-సర్వే పనులను పరిశీలించిన సిద్దిపేట కలెక్టర్ హైమావతి!
Gajwel: భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ భారతి రీ-సర్వే ప్రక్రియను జిల్లా కలెక్టర్ కె. హైమావతి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. శుక్రవారం గజ్వేల్ మండలం కోమటిబండ, వర్గల్ మండలం సింగాయపల్లి గ్రామాల్లో కొనసాగుతున్న రీ-సర్వే పనులను తనిఖీ చేసి, సంబంధిత అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. దాదాపు వందేళ్ల క్రితం భూముల సర్వే నిర్వహించారని, అప్పటి నుంచి జనాభా పెరుగుదల, భూముల విభజన తదితర కారణాలతో సర్వే నంబర్లు, భూముల హద్దులు, యాజమాన్య హక్కులకు సంబంధించి అనేక వివాదాలు, సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు.
ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో ప్రభుత్వం భూ భారతి రీ-సర్వే కార్యక్రమాన్ని చేపట్టిందని వివరించారు. ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసి, ముందుగా ప్రభుత్వ, అటవీ, ఇరిగేషన్, రైల్వే తదితర శాఖలకు సంబంధించిన భూములను సర్వే చేయాలని, ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత పట్టా భూముల సర్వే చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
సర్వే ప్రారంభానికి ముందు గ్రామసభ నిర్వహించి రైతులకు పూర్తి అవగాహన కల్పించాలని, వారి సందేహాలను అక్కడికక్కడే నివృత్తి చేయాలని సూచించారు. వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన భూముల సర్వే పూర్తయిన అనంతరం ఆయా శాఖల అధికారుల నుంచి ధ్రువీకరణతో కూడిన సంతకాలు తీసుకోవాలని సర్వే, రెవెన్యూ అధికారులకు స్పష్టం చేశారు.
రీ-సర్వే నిర్వహణకు సంబంధించిన సమాచారాన్ని రైతులకు కనీసం రెండు రోజుల ముందుగానే తెలియజేయాలని, సర్వే జరిగే సమయంలో రైతులు తమ భూముల వద్ద అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రోజువారీ లక్ష్యాలకు అనుగుణంగా జీపీఓలు, సర్వే, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేయాలని, అధునాతన రోవర్ యంత్రాల సహాయంతో భూముల కొలతలు చేపట్టి కచ్చితత్వం, పారదర్శకతకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ సూచించారు.
అనంతరం రైతులతో మాట్లాడిన కలెక్టర్.. భూ భారతి రీ-సర్వే ద్వారా భూములకు సంబంధించిన సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు. సర్వే పూర్తయిన తర్వాత కూడా ఏవైనా సందేహాలు లేదా సమస్యలు ఉంటే వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువచ్చి మరోసారి వెరిఫికేషన్ చేయించుకోవాలని సూచించారు.
రీ-సర్వే ప్రక్రియ విజయవంతంగా పూర్తయ్యేందుకు రైతులందరూ అధికారులకు సహకరించాలని కోరారు. అలాగే, ఎల్నినో ప్రభావం నేపథ్యంలో నీటి కొరత ఏర్పడే అవకాశం ఉన్నందున రబీ సీజన్లో వరి సాగుకు బదులుగా తక్కువ నీటితో పండించే ఆరుతడి పంటలను సాగు చేయాలని రైతులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో ఆయా మండలాల తహసీల్దార్లు, సర్వేయర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.




