Siddipet: సిద్దిపేట సభలో సీఎం రేవంత్ రెడ్డి సమస్యలపై మాట్లాడాలి!
Siddipet: నవంబర్ 19న సిద్దిపేటలో జరగనున్న సీఎం రేవంత్ రెడ్డి సభలో జిల్లా సమస్యలు, నిర్వాసితుల పరిహారం, ప్రభుత్వ యూనివర్సిటీపై ప్రకటన చేయాలని నేతలు డిమాండ్ చేశారు.
Siddipet: సిద్దిపేట సభలో సీఎం రేవంత్ రెడ్డి సమస్యలపై మాట్లాడాలి!
సిద్దిపేట జిల్లా: నవంబర్ 19వ తేదీన సిద్దిపేటలో జిల్లాలో జరగనున్న సీఎం బహిరంగ సభలో సిద్దిపేట జిల్లాలో ఉన్న సమస్యల పై మాట్లాడి పరిష్కార చర్యలు చేపట్టాలని సిపిఐ (ఎం.ఎల్) న్యూడెమోక్రసీ పార్టీ సిద్దిపేట కార్యదర్శి ఎస్.వి.శ్రీకాంత్ మరియు దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ డిమాండ్ చేశారు.
శుక్రవారం సిద్దిపేటలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థి స్థానంలో ఉండి ప్రజలకు అనేక రకాల హామీలు ఇచ్చాడని గద్దెనెక్కిన తర్వాత వాటిని నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సిద్దిపేట జిల్లాలో ప్రధాన సమస్యలుగా ఉన్న మల్లన్న సాగర్, కొండపోచమ్మ, గౌరవెల్లి, రంగనాయక సాగర్ ప్రాజెక్టుల కింద భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం ఇవ్వాల్సిన ప్రత్యేక ప్యాకేజీలు మరియు పరిహారాలు చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు, ఇప్పటికీ 350 ఎకరాలకు చెల్లించాల్సిన ప్యాకేజీ ఇవ్వడం లేదని మండిపడ్డారు.
అదేవిధంగా సిద్దిపేట జిల్లాలో కొన్ని మండలాలను మాత్రమే కరువు ప్రభావిత మండలాలుగా ప్రకటించి ప్రభుత్వం చేతులు దులుపుకుంటుందని తక్షణమే ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న అన్ని మండలాలను కరువు మండలాలుగా గుర్తించి నివారణ చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా సిద్దిపేట ప్రజల చిరకాల స్వప్నమైన ప్రభుత్వ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి సిద్దిపేట సభలో ప్రకటించాలని డిమాండ్ చేశారు.
జిల్లాలో విశ్వవిద్యాలయం లేకపోవడం వల్ల పేద విద్యార్థులు ఉన్నత విద్యను అందుకోలేక మధ్యలోనే వారి చదువులను ఆపివేస్తున్నారని ఆరోపించారు. అలాగే సిద్దిపేట జిల్లా కేంద్రంలో నెలకొల్పిన 1000 పడకల ప్రభుత్వ ఆసుపత్రి పనులను ప్రభుత్వం తక్షణమే పూర్తిచేసి ఎప్పుడు ప్రారంభిస్తారో ఆ తేదీని ప్రకటించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన చేవెళ్ల, కామారెడ్డి ,వరంగల్ డిక్లరేషన్ లను అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువత డీఎస్సీ నోటిఫికేషన్ కోసం గంపెడు ఆశలతో ఎదురుచూస్తున్నారని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంలో తీవ్రంగా విఫలమైందన్నారు. రాష్ట్రంలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఈ విషయాలన్నింటిపై సిద్దిపేట సభలో ముఖ్యమంత్రి మాట్లాడాలని సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ (ఎం.ఎల్) న్యూడెమోక్రసీ పార్టీ నాయకులు కె.యాదగిరి,దేవులపల్లి రమేష్, డిబిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి భీమ్ శేఖర్, ఉపాధ్యక్షులు పోతరాజు శంకర్, బెజ్జెంకి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.




