Cheriyal: డీలిమిటేషన్ బిల్లుతో చేర్యాల ప్రజల్లో చిగురిస్తున్న ఆశలు

Cheriyal: డీలిమిటేషన్ బిల్లు నేపథ్యంలో సిద్దిపేట జిల్లా చేర్యాలకు తిరిగి నియోజకవర్గ హోదా దక్కుతుందని స్థానికులు ఆశిస్తున్నారు. 2009లో ఈ సెగ్మెంట్ కనుమరుగైంది.

CHANDRAREDDY,	CHERIYAL
Published on: 29 Nov 2026 4:59 PM IST
Cheriyal
X

Cheriyal: డీలిమిటేషన్ బిల్లుతో చేర్యాల ప్రజల్లో చిగురిస్తున్న ఆశలు

చేర్యాల: సిద్దిపేట జిల్లా చేర్యాల ప్రాంత ప్రజల్లో మరోసారి రాజకీయ ఆశలు చిగురిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం రేపు పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న డీలిమిటేషన్ బిల్లుతో చేర్యాల ప్రాంతానికి తిరిగి నియోజకవర్గ హోదా దక్కుతుందనే ఆశాభావం ప్రజల్లో వ్యక్తమవుతోంది.

1957 నుంచి 2008 వరకు నియోజకవర్గ కేంద్రంగా కొనసాగిన చేర్యాల ప్రాంతం.. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో కనుమరుగైంది. స్థానిక నాయకుల నిర్లక్ష్యం, రాజకీయ పరిణామాల కారణంగా తమ ప్రాంతం నియోజకవర్గ హోదాను కోల్పోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చారిత్రకంగా, భౌగోళికంగా అన్ని అర్హతలు కలిగిన చేర్యాల ప్రాంతం.. గతంలో 12 సార్లు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజాప్రతినిధులను ఎన్నుకున్న ఘనతను కలిగి ఉంది. అయినప్పటికీ పునర్విభజనలో చేర్యాలకు స్థానం దక్కకపోవడం ఈ ప్రాంత ప్రజలకు నిరాశ కలిగించింది.

అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న డీలిమిటేషన్ బిల్లుతో మరోసారి చేర్యాల నియోజకవర్గ ఏర్పాటు అంశం తెరపైకి వచ్చింది. ఎన్నో ఏళ్లుగా తమ ప్రాంతానికి తిరిగి నియోజకవర్గ హోదా కల్పించాలని కోరుతున్న ప్రజలు.. ఈసారి అయినా తమ కల నెరవేరుతుందని ఆశగా ఎదురుచూస్తున్నారు.

మరి కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న డీలిమిటేషన్ బిల్లులో చేర్యాలకు స్థానం దక్కుతుందా..? తిరిగి నియోజకవర్గ కేంద్రంగా చేర్యాల అవతరిస్తుందా..? అన్నది వేచి చూడాల్సిందే.

చేర్యాల ప్రజల దశాబ్దాల ఆకాంక్ష నెరవేరుతుందా..? అనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది.

CHANDRAREDDY,	CHERIYAL

CHANDRAREDDY, CHERIYAL