Gajwel: GVK Green Health Services CEO బి. సుధాకర్ సూచనలు!
Gajwel: దీపావళి పండుగ వేళ బాణసంచా కాల్చేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలని, అత్యవసర వైద్య సేవల కోసం 108కి కాల్ చేయాలని జీవీకే గ్రీన్ హెల్త్ సర్వీసెస్ సీఈఓ బి. సుధాకర్ సూచించారు.
Gajwel: GVK Green Health Services CEO బి. సుధాకర్ సూచనలు!
Gajwel: దీపావళి పండుగను ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాల మధ్య సురక్షిత వాతావరణంలో జరుపుకోవాలని జీవీకే గ్రీన్ హెల్త్ సర్వీసెస్ తెలంగాణ రాష్ట్ర కార్యనిర్వాహక అధికారి బి. సుధాకర్ సూచించారు. పండుగ వేళ బాణసంచా కాల్చేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలని, ఏదైనా అనుకోని ప్రమాదం జరిగినప్పుడు అత్యవసర వైద్య సేవల కోసం 108 అంబులెన్స్‌కు ఫోన్ చేయాలని ఆయన కోరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దీపావళి ప్రతి ఒక్కరి ఇంట్లో వెలుగులు నింపే పండుగ అని, చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఆనందంగా జరుపుకునే ఈ వేడుకలో భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ముఖ్యంగా చిన్నపిల్లలు బాణసంచా కాల్చే సమయంలో పెద్దలు తప్పనిసరిగా పర్యవేక్షించాలని, పిల్లలకు పెద్ద బాణసంచా అందుబాటులో ఉంచకూడదని తెలిపారు.
టపాసులు కాల్చేటప్పుడు చెప్పులు ధరించాలని, చేతులతో టపాసులు పట్టుకుని పేల్చకూడదని, వదులుగా ఉండే దుస్తులకు బదులుగా శరీరానికి దగ్గరగా ఉండే దుస్తులు ధరించాలని సూచించారు. కళ్ల రక్షణ కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, పొగకు దూరంగా ఉండేందుకు అవసరమైనప్పుడు మాస్కులు ధరించాలని పేర్కొన్నారు.
బాణసంచా కాల్చిన అనంతరం చేతులను శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు. అనుకోకుండా కాలిన గాయాలు ఏర్పడితే వెంటనే బాధిత ప్రాంతంపై సాధారణ చల్లని నీటిని 10 నుంచి 20 నిమిషాల పాటు పోయాలని, అనంతరం శుభ్రమైన గుడ్డతో గాయాన్ని కప్పి ఉంచాలని తెలిపారు. తీవ్రమైన గాయాలైనప్పుడు సొంత వైద్యం చేయకుండా వైద్యుల సూచనల మేరకు చికిత్స పొందాలని పేర్కొన్నారు.
అధికంగా బాణసంచా కాల్చడం వల్ల వాయు కాలుష్యం పెరిగి శ్వాసకోశ, గుండె సంబంధిత సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తెలంగాణలోని ప్రతి మండలంలో 108 అంబులెన్స్ వాహనం అందుబాటులో ఉంటుందని, దీపావళి పండుగ సందర్భంగా సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు అత్యవసర సేవలు అందిస్తారని బి. సుధాకర్ వెల్లడించారు. ఏదైనా ప్రమాదం జరిగినా, అత్యవసర వైద్య సహాయం అవసరమైనా వెంటనే 108కు ఫోన్ చేయాలని కోరారు.
ఈ దీపావళి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సంతోషాలు, వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆయన దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.




