Siddipet: కార్మికుల హామీలపై సీఎం స్పందించలేదు.. బీఆర్‌టీయూ ఫైర్!
Siddipet: సిద్దిపేట పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి కార్మికుల హామీలపై స్పందించలేదని బీఆర్‌టీయూ విమర్శించింది. బీడీ, ఆశా, అంగన్‌వాడీ కార్మికుల డిమాండ్లు నెరవేర్చాలని కోరింది.
Siddipet: కార్మికుల హామీలపై సీఎం స్పందించలేదు.. బీఆర్‌టీయూ ఫైర్!
Siddipet: ఈ నెల 19వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు సిద్దిపేట జిల్లాకు వచ్చిన సందర్భంగా జిల్లాలోని వేలాది మంది కార్మికులు తమ సమస్యలపై ముఖ్యమంత్రి స్పందిస్తారని, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుపై స్పష్టమైన ప్రకటన చేస్తారని ఎంతో ఆశగా ఎదురుచూశారు. కానీ ముఖ్యమంత్రి పర్యటనలో కార్మికుల సమస్యలపై ఎలాంటి స్పష్టమైన హామీలు ఇవ్వకపోవడం తీవ్ర నిరాశకు గురిచేసింది.
ప్రతిపక్ష నాయకులను విమర్శించడానికే పరిమితమై, కార్మికులకు ఇచ్చిన హామీల అమలుపై ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం విచారకరం. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలు, ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలలో కార్మికులకు సంబంధించిన హామీలు ఎప్పుడు అమలు చేస్తారో ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి.
గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ, కార్మికులకు మరిన్ని ప్రయోజనాలు కల్పించాల్సిన ప్రభుత్వం, ఉన్న సంక్షేమ పథకాలను నీరుగార్చే ప్రయత్నం చేయడం కార్మిక వర్గంలో ఆందోళన కలిగిస్తోంది.
ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా బిఆర్టియు కార్యాలయంలో ఏర్పాటుచేసిన పత్రిక సమావేశంలో BRTU జిల్లా అధ్యక్షుడు పిండి అరవింద్ యాదవ్ తెలంగాణ రాష్ట్ర బీడీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు మంచే నర్సింలు గార్లు మాట్లాడుతూ:
బీడీ కార్మికులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో బీడీ కార్మికులకు నెలకు రూ.4,000 ఆసరా పెన్షన్ ఇస్తామని, ESI పరిధిలోకి తీసుకువస్తామని, 2014 PF కటాఫ్ తేదీని తొలగిస్తామని హామీ ఇచ్చింది. కానీ ఇప్పటివరకు ఈ హామీల అమలుపై స్పష్టమైన చర్యలు కనిపించడం లేదు.
బీడీ కార్మికులు, వృద్ధాప్యంలో ఉన్న అర్హులైన లబ్ధిదారులు ఆసరా పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ ఆన్‌లైన్‌లో దరఖాస్తు ప్రక్రియ అందుబాటులో లేకపోవడం సమస్యగా మారింది. ప్రభుత్వం వెంటనే పెన్షన్ దరఖాస్తుల ఆన్‌లైన్ ప్రక్రియను ప్రారంభించి అర్హులైన బీడీ కార్మికులు, వృద్ధులకు పెన్షన్లు మంజూరు చేయాలి.
ఆశా వర్కర్లకు రూ.18,000 వేతనం ఎక్కడ?
ఆశా వర్కర్లకు నెలకు రూ.18,000 ఫిక్స్‌డ్ వేతనం ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు అమలు చేయలేదు. ప్రతి గ్రామంలో సుమారు 1,000 మందికి ఒక ఆశా వర్కర్ ఉండాల్సిన అవసరం ఉన్నప్పటికీ, అనేక ప్రాంతాల్లో 3,000 నుంచి 4,000 మంది జనాభాకు ఒకే ఆశా వర్కర్ సేవలు అందిస్తూ అధిక పనిభారంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
వారిపై పనిభారాన్ని తగ్గించి, ఇచ్చిన రూ.18,000 వేతన హామీని వెంటనే అమలు చేయాలి.
అంగన్‌వాడీ టీచర్లు, RPలకు న్యాయం చేయాలి
అంగన్‌వాడీ టీచర్లు, రిసోర్స్ పర్సన్లు (RP)కు నెలకు రూ.18,000 వేతనం ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు అమలు చేయలేదు. ఎన్నో సంవత్సరాలుగా ప్రజలకు సేవలందిస్తున్న ఈ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి.
మధ్యాహ్న భోజన కార్మికులకు రూ.10,000 వేతనం ఇవ్వాలి
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు భోజనం వండి పెడుతున్న మధ్యాహ్న భోజన కార్మికులకు నెలకు రూ.10,000 వేతనం ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటికీ ఆ హామీ అమలుకు నోచుకోలేదు. వారికి ఇచ్చిన హామీని వెంటనే అమలు చేసి పెండింగ్ బకాయిలు ఉంటే చెల్లించాలి.
అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి
అసంఘటిత రంగంలో పనిచేస్తున్న ఆటో కార్మికులు, హమాలీ కార్మికులు, వీధి వ్యాపారులకు కాంగ్రెస్ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది. కానీ ఇప్పటివరకు వాటి అమలుకు సంబంధించి సరైన చర్యలు తీసుకోలేదు.
ఆటో కార్మికులు, హమాలీ కార్మికుల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలి.
హమాలీ కార్మికులకు హెల్త్ కార్డులు అందించాలి.
వీధి వ్యాపారులకు గుర్తింపు కార్డులతో పాటు వడ్డీ లేని రుణాలు అందించాలి.
ఆటో కార్మికులకు ప్రతి సంవత్సరం రూ.12,000 ఆర్థిక సహాయం అందిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలి.
ఆటో కార్మికులకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి.
ఆర్టీసీలోకి ప్రైవేట్ వాహనాలను తీసుకువచ్చే ప్రయత్నాలను వెంటనే నిలిపివేయాలి. దీనివల్ల ఆర్టీసీ కార్మికులు, ఆటో కార్మికుల ఉపాధిపై ఎలాంటి ప్రభావం పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
అన్ని రంగాల్లో పనిచేస్తున్న అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రత, ఉద్యోగ భద్రత కల్పించాలి.
BRTU ప్రధాన డిమాండ్
సిద్దిపేట జిల్లాలోని బీడీ కార్మికులు, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ ఉద్యోగులు, మధ్యాహ్న భోజన కార్మికులు, ఆటో కార్మికులు, హమాలీ కార్మికులు మరియు అసంఘటిత రంగ కార్మికుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి.
ఎన్నికల సమయంలో కార్మికులకు ఇచ్చిన హామీలను కేవలం ఎన్నికల ప్రచారానికే పరిమితం చేయకుండా, వాటిని అమలు చేసి కార్మిక కుటుంబాలకు న్యాయం చేయాలని తెలంగాణ రాష్ట్ర బీడీ వర్కర్స్ యూనియన్ (BRTU) తరఫున డిమాండ్ చేస్తున్నాము.
ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మిక సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి సమస్యల పరిష్కారానికి స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలి. లేనిపక్షంలో కార్మికుల హక్కుల సాధన కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరిస్తున్నాము.
ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షుడు బాయ కాడి శ్రీనివాస్ గుండి సంజీవులు కొండయ్య ఆకుల తిరుపతి పాల్గొన్నారు.




