Siddipet: భూ భారతి రీ-సర్వేను వేగవంతం చేయాలి: కలెక్టర్ హైమావతి
Siddipet: ములుగు మండలం క్షీరసాగర్‌లో జరుగుతున్న భూ భారతి రీ-సర్వేను పరిశీలించిన సిద్దిపేట కలెక్టర్ కె. హైమావతి రోజుకు 40 ఎకరాలకు పైగా పూర్తి చేయాలని ఆదేశించారు.
Siddipet: భూ భారతి రీ-సర్వేను వేగవంతం చేయాలి: కలెక్టర్ హైమావతి
Siddipet: సిద్దిపేట జిల్లా ములుగు మండలంలోని క్షీరసాగర్ గ్రామంలో కొనసాగుతున్న భూ భారతి రీ-సర్వే ప్రక్రియను గురువారం జిల్లా కలెక్టర్ కె. హైమావతి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రీ-సర్వే జరుగుతున్న తీరును పరిశీలించిన ఆమె.. సర్వే పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. స్వాతంత్ర్యానికి పూర్వం నిర్వహించిన భూముల సర్వే అనంతరం ప్రస్తుతం పెరిగిన జనాభా, భూముల విస్తీర్ణం, హద్దులు తదితర అంశాలకు సంబంధించి అనేక భూ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని తెలిపారు. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించే ఉద్దేశంతో ప్రభుత్వం భూ భారతి రీ-సర్వే ప్రక్రియను చేపట్టిందని పేర్కొన్నారు.
గ్రామం మొత్తం విస్తీర్ణం ఎంత, ఇప్పటివరకు ఎంత మేర రీ-సర్వే పూర్తయిందనే వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. సర్వేయర్, లైసెన్స్‌డ్ సర్వేయర్ కలిసి అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన రెండు రోవర్స్ సహాయంతో భూముల రీ-సర్వే నిర్వహిస్తున్నట్లు అధికారులు కలెక్టర్‌కు వివరించారు.
ప్రస్తుతం రోజుకు 30 నుంచి 35 ఎకరాల వరకు సర్వే చేస్తున్నట్లు తెలిపారు.రీ-సర్వే పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఉదయం 8 గంటలకే సర్వే పనులు ప్రారంభించి, రోజుకు 40 ఎకరాలకు పైగా సర్వే పూర్తయ్యేలా ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని సూచించారు.
రికార్డులతో సరిపోల్చి వివరాలు నమోదు చేయాలి..
భూ రీ-సర్వే ప్రక్రియను పారదర్శకంగా, ఖచ్చితత్వంతో నిర్వహించాలని, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రీ-సర్వే సమయంలో భూమి విస్తీర్ణం, సర్వే నంబర్లు, హద్దులు, పట్టా వివరాలు తదితర అంశాలను సంబంధిత రెవెన్యూ రికార్డులతో సరిపోల్చి నమోదు చేయాలని సూచించారు.సర్వే ద్వారా సేకరించిన ప్రతి వివరాన్ని రెవెన్యూ రికార్డుల్లో పక్కాగా నమోదు చేయాలని తహసీల్దార్‌ను ఆదేశించారు.
రీ-సర్వేకు రైతులు సహకరించాలి..
భూ భారతి రీ-సర్వే ప్రక్రియకు రైతులు సహకరించాలని జిల్లా కలెక్టర్ కోరారు. రీ-సర్వే పూర్తయిన తర్వాత భూముల హద్దులు, సర్వే నంబర్లు, బై నంబర్లకు సంబంధించిన సమస్యలు తలెత్తకుండా పక్కాగా నిర్దేశించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.జిల్లా కలెక్టర్ వెంట తహసీల్దార్, స్థానిక సర్పంచ్ బాలరెడ్డి, ప్రజాప్రతినిధులు, సర్వే అధికారులు, సంబంధిత రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




