Mulugu: ములుగు పీహెచ్‌సీని సందర్శించిన 5 దేశాల వైద్య ప్రతినిధుల బృందం!

Mulugu: సిద్దిపేట జిల్లా ములుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం ఐదు దేశాల వైద్య ప్రతినిధుల బృందం సందర్శించి షుగర్, బీపీ సేవలపై ఆరా తీసింది.

Osman Pathan, GAJEWL
Published on: 19 Nov 2026 3:52 PM IST
Mulugu
X

Mulugu: ములుగు పీహెచ్‌సీని సందర్శించిన 5 దేశాల వైద్య ప్రతినిధుల బృందం!

ములుగు: సిద్దిపేట జిల్లా ములుగు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఐదు దేశాలకు చెందిన అంతర్జాతీయ వైద్య ప్రతినిధుల బృందం సందర్శించింది. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రంలో అమలవుతున్న వైద్య విధానాలు, రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, చికిత్సా ప్రక్రియలపై వైద్యులను అడిగి వివరాలు తెలుసుకుంది.

ముఖ్యంగా మధుమేహం (షుగర్), రక్తపోటు (బీపీ) బాధితులకు అందిస్తున్న వైద్య సేవలు, మందుల పంపిణీ విధానంపై బృందం సభ్యులు ఆరా తీశారు. దీనికి స్పందించిన వైద్యులు ప్రభుత్వ వెబ్‌సైట్‌లో రోగుల వివరాలను నమోదు చేసి, వారికి అవసరమైన మందులను ఉచితంగా అందజేస్తున్నట్లు వివరించారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులకు సైతం ప్రభుత్వం ద్వారా వైద్య సేవలు, ఉచిత మందులు అందిస్తున్నట్లు వైద్యురాలు దీప్తి తెలిపారు.

అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆరోగ్య ఉపకేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు, ప్రతి వెయ్యి మంది జనాభాకు ఒక ఆశా కార్యకర్తను నియమించి ప్రాథమిక స్థాయిలో ఆరోగ్య సేవలను ప్రజలకు చేరువ చేస్తున్నట్లు వైద్యులు అంతర్జాతీయ ప్రతినిధుల బృందానికి వివరించారు.

ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రంలో అందుతున్న సేవలు, ప్రభుత్వ వైద్య విధానాల అమలుపై బృందం సభ్యులు వివరాలు సేకరించారు.

Osman Pathan, GAJEWL

Osman Pathan, GAJEWL