Siddipet: సిద్దిపేటలో అక్రమంగా 20 దుకాణ సముదాయాల నిర్మాణం: గ్యాదరి రాజారాం!

Siddipet: సిద్దిపేట మున్సిపల్ కార్యాలయం పక్కనే సీఎస్ఐ చర్చి భూమిలో అక్రమంగా నిర్మించిన 20 దుకాణాలను కూల్చివేయాలని వీహెచ్‌పీ నేత గ్యాదరి రాజారాం డిమాండ్ చేశారు.

RAJU, SIDDIPET
Published on: 26 Nov 2026 6:12 PM IST
Siddipet
X

Siddipet: సిద్దిపేటలో అక్రమంగా 20 దుకాణ సముదాయాల నిర్మాణం: గ్యాదరి రాజారాం!

సిద్దిపేట: సిద్దిపేట పట్టణ నడిబొడ్డున మున్సిపల్ కార్యాలయం పక్కనే ఉన్న చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా (CSI) చర్చి భూమిలో సుమారు 20 దుకాణ సముదాయాలను ఎలాంటి మున్సిపల్ అనుమతులు లేకుండా నిర్మించారని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర నాయకులు గ్యాదరి రాజారాం ఆరోపించారు.

సదరు భూమి కోర్టు వివాదాల్లో ఉన్నప్పటికీ, ఎలాంటి అనుమతులు లేకుండా భారీ స్థాయిలో వాణిజ్య నిర్మాణాలు చేపట్టడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆయన విమర్శించారు. నిర్మాణాలు అధికారుల కళ్ల ముందే జరుగుతున్నప్పటికీ అడ్డుకోకపోవడం వెనుక భారీగా అవినీతి, ముడుపుల వ్యవహారం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు.

సామాన్య ప్రజలు చిన్న రేకుల షెడ్డు నిర్మించుకున్నా వెంటనే స్పందించి కూల్చివేసే అధికారులు, పట్టణ నడిబొడ్డున ఇన్ని దుకాణ సముదాయాలు నిర్మిస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఒక్కో దుకాణం షట్టర్‌కు రూ.10 లక్షల చొప్పున వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయని తెలిపారు.

ఈ నిర్మాణాలపై సమాచార హక్కు చట్టం (RTI) ద్వారా మున్సిపల్ కార్యాలయంలో వివరాలు కోరగా, సంబంధిత నిర్మాణదారులకు నోటీసులు జారీ చేశామని, త్వరలో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని అధికారులు సమాధానం ఇచ్చినట్లు రాజారాం వెల్లడించారు.

ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా ఉన్నతాధికారులు స్పందించి అక్రమ నిర్మాణాలపై సమగ్ర విచారణ జరిపించాలని, నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన దుకాణ సముదాయాలను కూల్చివేయాలని, బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అక్రమ నిర్మాణాలకు పాల్పడిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకొని అరెస్టు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ నాయకులు పొదిల శ్రీనివాస్, అజయ్, యోగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

RAJU, SIDDIPET

RAJU, SIDDIPET