Konaseema: ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని డిమాండ్!

Konaseema: కోటిపల్లి–నరసాపురం రైల్వే ప్రాజెక్టు పనుల పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని వైఎస్సార్‌సీపీ ప్రతినిధి తెన్నేటి కిషోర్ ఆరోపణ. వివరాలు.

PRABHU, RAZOLE
Published on: 29 Sept 2026 8:32 AM IST
Konaseema
X

Konaseema: ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని డిమాండ్!

Konaseema: అంబేడ్కర్ కోనసీమ జిల్లా ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన కోటిపల్లి–నరసాపురం రైల్వే ప్రాజెక్టు పనుల విషయంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి తెన్నేటి కిషోర్ ఆరోపించారు.రాజోలు లోని తన నివాసంలో మాట్లాడుతూ..దశాబ్దాలుగా నత్తనడకన సాగుతున్న

ఈ ప్రాజెక్టును పూర్తి చేయడంపై ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు కేటాయించడంతో పాటు భూసేకరణను వేగవంతం చేయకపోవడంతో పనుల్లో జాప్యం జరుగుతోందని పేర్కొన్నారు.

56 కిలోమీటర్ల పొడవైన ఈ రైల్వే ప్రాజెక్టుకు ఇప్పటివరకు రూ.1,181.19 కోట్ల నిధులు ఖర్చు చేసినట్లు తెలిపారు. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.2,120 కోట్లు కాగా, పెరుగుతున్న నిర్మాణ వ్యయాలకు అనుగుణంగా అంచనాలను సవరించి కేంద్ర ప్రభుత్వానికి నివేదించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు.

ప్రాజెక్టుకు మొత్తం 416.79 హెక్టార్ల భూమి అవసరం కాగా, ఇప్పటివరకు 163.02 హెక్టార్ల భూమిని మాత్రమే సమీకరించి ఇచ్చారని కిషోర్ తెలిపారు. మిగిలిన భూమిని త్వరితగతిన సమీకరించి రైల్వే శాఖకు అప్పగించాలని డిమాండ్ చేశారు.

కోటిపల్లి–నరసాపురం రైల్వే లైన్‌ పూర్తయితే కోనసీమలో రవాణా సౌకర్యాలు మెరుగుపడి వాణిజ్య, పారిశ్రామిక, పర్యాటక రంగాల అభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి రాష్ట్ర వాటా నిధులు విడుదల చేయడంతో పాటు పనులను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైల్వే ప్రాజెక్టు కోసం ప్రజలతో కలిసి ఉద్యమం చేపడతామని తెన్నేటి కిషోర్ హెచ్చరించారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE