Yetapaka: కూటమిలో కుంపటి – రెండింటికీ దక్కని పార్టీ గుర్తులు!

Yetapaka: ఎటపాక జెడ్పీటీసీ పరిధిలో కూటమికి విచిత్ర రాజకీయ తిప్పలు. బీ-ఫామ్ల సాంకేతిక లోపంతో సైకిల్, గ్లాస్ గుర్తులు రాక స్వతంత్రులుగా పోటీ పడుతున్న దేవి, సుస్మిత.

RAJESH REDDY, CHINTOOR
Published on: 27 Oct 2026 10:45 PM IST
Yetapaka
X

Yetapaka: కూటమిలో కుంపటి – రెండింటికీ దక్కని పార్టీ గుర్తులు!

ఎటపాక: ఎటపాక జడ్పిటిసి టికెట్ కేటాయింపు కూటమిలో కుంపటి రగిలించింది.దీంతో రెంటికీ చెడ్డ రేవడి లా కూటమి పరిస్థితి మారింది.ఎటపాక తెలుగుదేశం నాయకుల మద్దతుతో జడ్పిటిసి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీకి చెందిన పాయం దేవి నామినేషన్ దాఖలు చేసారు.ఇక అధిష్టానం నుంచి పాయం దేవి కి తెలుగుదేశం జడ్పిటిసి అభ్యర్థిగా బి ఫామ్ వచ్చినట్లే అని తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు భావించారు.

జడ్పిటిసి టికెట్ ఖాయమని భావించిన పాయం దేవి ప్రచారం కూడా ముమ్మరం చేశారు. ఇది ఇలా ఉండగా ఎటపాక వైఎస్ఆర్సిపి మాజీ జడ్పిటిసి ఉబ్బా సుస్మిత స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.ఇంతలో విచిత్ర రాజకీయ పరిణామాలు చోటుచేసుకుని సుష్మిత జనసేన పార్టీలో చేరి జనసేన పార్టీ నుంచి జడ్పిటిసి అభ్యర్థిగా బి ఫాం తెచ్చుకోవడం జరిగింది.

చివరి నిమిషంలో సుస్మిత జనసేన నుంచి బీఫామ్ తెచ్చుకోవడంతో తెలుగుదేశం పార్టీ పాయం దేవికి బీఫామ్ ఇవ్వలేదు.నామినేషన్ విత్ డ్రా ఆఖరి రోజున సుస్మిత జనసేన తరఫున బీఫామ్ ను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించిన ఫలితం లేకుండా పోయింది.ముందుగా సుష్మిత స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడంతో జనసేన బీఫామ్ ను అధికారులు స్వీకరించలేదు.

దీంతో సుస్మిత జనసేన సింబల్ గాజు గ్లాసు కాకుండా స్వతంత్ర అభ్యర్థి కి ఇచ్చే గుర్తు తోనే పోటీలో దిగనున్నారు.తెలుగుదేశం పార్టీ తరఫున జడ్పిటిసి స్థానానికి నామినేషన్ వేసిన పాయం దేవికి పార్టీ నుంచి బీఫామ్ ఇవ్వకపోవడంతో పాయం దేవి సైతం పార్టీ గుర్తు సైకిల్ కాకుండా స్వతంత్ర అభ్యర్థి కి ఇచ్చే గుర్తు తోనే పోటీ కి దిగాల్సిన పరిస్థితి వచ్చింది.

ఒకపక్క తెలుగుదేశం పార్టీ నుంచి బీఫామ్ ఇవ్వకపోవడంతో పాయం దేవి ఎన్నికల బరిలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం,మరోపక్క జనసేన పార్టీ బీఫామ్ ఇచ్చినప్పటికీ సుస్మిత ముందుగా స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడంతో జనసేన జడ్పిటిసి అభ్యర్థి గా అర్హత సాధించకపోవడంతో ఎటపాక కూటమి కి భారీ ఎదురు దెబ్బ తగిలింది.

ఉబ్బా సుష్మితకు స్వతంత్ర అభ్యర్థిగా ఎయిర్ కండిషనర్ గుర్తు, పాయం దేవి కి బీరువా గుర్తును ఎన్నికల రిటర్నింగ్ అధికారి కేటాయించడం జరిగింది.ఎటపాక జెడ్పిటిసి టికెట్ కేటాయింపులో ఊహించని పరిణామం చోటు చేసుకోవడంతో కూటమి నాయకులు కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు.ఇటు తెలుగుదేశం పార్టీ సింబల్, అటు జనసేన పార్టీ సింబల్ లేకుండా అభ్యర్థులను ఏ విధంగా గెలిపించుకోవాలో అని ఇరువర్గాలకు చెందిన నాయకులు కార్యకర్తలు అయోమయంలో పడ్డారు.

RAJESH REDDY, CHINTOOR

RAJESH REDDY, CHINTOOR