Devarapalli: దేవరపల్లిలో ఘనంగా గుండె ఆరోగ్యంపై అవగాహన ర్యాలీ!

Devarapalli: దేవరపల్లిలో ఘనంగా ప్రపంచ హృదయ దినోత్సవ ర్యాలీ సుమంత్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ఆధ్వర్యంలో అవగాహన 2,500 మందికి ఉచిత వైద్య పరీక్షలు, డాక్టర్ సుమంత్ పిలుపు.

PAMULA NAGENDRA BABU, GOPALAPURAM
Published on: 29 Sept 2026 5:18 PM IST
Devarapalli
X

Devarapalli: దేవరపల్లిలో ఘనంగా గుండె ఆరోగ్యంపై అవగాహన ర్యాలీ!

దేవరపల్లి: తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో ప్రపంచ హృదయ దినోత్సవాన్ని పురస్కరించుకుని సుమంత్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ఆధ్వర్యంలో గుండె ఆరోగ్యంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, విద్యార్థులు, ఆస్పత్రి సిబ్బంది, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గుండె జబ్బులపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా సుమంత్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి వైద్యులు డాక్టర్ సుమంత్ మాట్లాడుతూ.. ప్రస్తుత జీవనశైలిలో శరీరానికి తగినంత వ్యాయామం లేకపోవడం, మితిమీరిన ఒత్తిడి, చెడు ఆహారపు అలవాట్లు, ఇతర అనారోగ్యకరమైన అలవాట్ల కారణంగా గుండె సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా యువత తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.

గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ కొంత సమయం వ్యాయామానికి కేటాయించాలని, సమతుల్య ఆహారం తీసుకోవాలని, ఒత్తిడిని తగ్గించుకోవాలని సూచించారు. పొగతాగడం, మద్యపానం వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని తెలిపారు. గుండె సంబంధిత లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో వైద్యులను సంప్రదించాలని సూచించారు.

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని పురస్కరించుకుని సుమంత్ ఆస్పత్రి వద్ద మూడు రోజుల పాటు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించినట్లు డాక్టర్ సుమంత్ తెలిపారు. ఈ శిబిరంలో సుమారు 2,500 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి మందులు ఉచితంగా అందజేసినట్లు చెప్పారు.

ప్రతి ఒక్కరూ ఏడాదిలో కనీసం ఒక్కసారైనా గుండెతో పాటు ఇతర ముఖ్యమైన ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని డాక్టర్ సుమంత్ సూచించారు. ఆరోగ్యంపై ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా అనేక అనారోగ్య సమస్యలను నివారించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న పలువురు గుండె ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

PAMULA NAGENDRA BABU, GOPALAPURAM

PAMULA NAGENDRA BABU, GOPALAPURAM