Amalapuram: బహ్రెయిన్ నుంచి రాజోలుకు చేరిన బాధిత మహిళ.. కలెక్టర్ చొరవ!
Amalapuram: బహ్రెయిన్‌లో ఇబ్బందులు పడుతున్న రాజోలు మహిళ నక్కా దుర్గను కలెక్టర్ మహేష్ కుమార్ ఆదేశాలతో అధికారులు స్వగ్రామానికి సురక్షితంగా చేర్చారు. విదేశీ ఉద్యోగాలపై సూచనలు.
Amalapuram: బహ్రెయిన్ నుంచి రాజోలుకు చేరిన బాధిత మహిళ.. కలెక్టర్ చొరవ!
Amalapuram: బహ్రెయిన్‌లో ఉపాధి నిమిత్తం వెళ్లి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న అంబేడ్కర్ కోనసీమ జిల్లా, రాజోలు మండలం, రాజోలుకు చెందిన నక్కా దుర్గను జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ రావిరాల ఆదేశాలతో మైగ్రేషన్ మేనేజ్మెంట్ సెంటర్ అధికారులు సురక్షితంగా స్వగ్రామానికి చేర్చారు.
నాలుగు నెలల క్రితం ఉపాధి కోసం బహ్రెయిన్ వెళ్లిన నక్కా దుర్గ అక్కడ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆమె భర్త మైగ్రేషన్ మేనేజ్మెంట్ సెంటర్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన అధికారులు సంబంధిత ఏజెంట్‌తో సంప్రదింపులు జరిపి, ఆమెను స్వదేశానికి రప్పించేందుకు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో దుర్గ స్వగ్రామానికి చేరుకోవడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.
విదేశాల్లో ఉపాధి కోసం వెళ్లి ఇబ్బందులు ఎదుర్కొంటున్న కార్మికులకు అండగా నిలవడం, బాధితులను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడం, వారి కుటుంబాలకు భరోసా కల్పించడం మైగ్రేషన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు.
విదేశీ ఉద్యోగాలకు వెళ్లేవారు ముందుగా పూర్తి సమాచారం తెలుసుకోవాలని, చట్టబద్ధమైన మార్గాల్లోనే ప్రయాణించాలని, అనుమతి పొందిన రిక్రూటింగ్ ఏజెంట్ల ద్వారా ఉద్యోగాలు పొందాలని సూచించారు. మోసపూరిత ఏజెంట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా రెవెన్యూ అధికారి వీర్ల సుబ్బారావు, మైగ్రేషన్ మేనేజ్మెంట్ సెంటర్ మేనేజర్ గోళ్ళ రమేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ కడియాల సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.




