Amalapuram: అమలాపురంలో ఘనంగా శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతి

Amalapuram: అమలాపురం కలెక్టరేట్‌ గోదావరి భవనంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతిని డీఆర్వో వి. సుబ్బారావు ఘనంగా నిర్వహించారు.

SURESH, AMALAPURAM
Published on: 17 Sept 2026 3:49 PM IST
Amalapuram
X

Amalapuram: అమలాపురంలో ఘనంగా శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతి

అమలాపురం: సమాజ అభివృద్ధిలో వృత్తిదారులైన శిల్పులు, వడ్రంగులు,కమ్మరులు, కంసాలీలు,ఇతర చేతివృత్తిదారుల పాత్ర అత్యంత కీలకమైనదని జిల్లా రెవెన్యూ అధికారి వి.సుబ్బారావు పేర్కొన్నారు.తమ వృత్తిపట్ల అంకితభావంతో,శ్రమశక్తితో, సృజనాత్మకతతో పనిచేసే వృత్తిదారులు సమాజ నిర్మాణంలో విశిష్ట సేవలు అందిస్తున్నారని అన్నారు.

శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతి సందర్భంగా వృత్తిదారుల సేవలను స్మరించుకోవడం,వారి నైపుణ్యాన్ని ప్రోత్సహించడం మనందరి బాధ్యత అని తెలిపారు.ఈ రోజు స్థానిక అమలాపురం కలెక్టరేట్‌లోని గోదావరి భవన్‌లో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి జిల్లా రెవెన్యూ అధికారి వి.సుబ్బారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా బీసీ సంక్షేమ అధికారులు,విశ్వబ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు,వివిధ సంక్షేమ సంఘాల నాయకులతో కలిసి శ్రీ విరాట్ విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

సృష్టి నిర్మాణంలో విశ్వకర్మ పాత్ర విశిష్టం అని తెలియజేసారు.ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి మాట్లాడుతూ భారతీయ ఆధ్యాత్మిక, సాంస్కృతిక సంప్రదాయాల్లో శ్రీ విరాట్ విశ్వకర్మకు విశిష్టమైన స్థానం ఉందన్నారు.సృష్టి ఆవిర్భావం వెనుక ఉన్న పరమార్థాన్ని వివరించే సందర్భంలో కృతయుగం, త్రేతాయుగం,ద్వాపరయుగం, కలియుగం అనే నాలుగు యుగాల ప్రాధాన్యతను వివరించారు.

భారతీయ సంప్రదాయాల ప్రకారం సృష్టి నిర్వహణలో బ్రహ్మ,విష్ణు, మహేశ్వరులు ప్రధాన దైవ స్వరూపాలుగా భావించబడతారని,బ్రహ్మ స్వరూపంగా అవతరించిన సృష్టి మూలపురుషుడు శ్రీ విరాట్ విశ్వకర్మ అని ఆయన పేర్కొన్నారు.విశ్వకర్మ తత్వం కేవలం ఒక వృత్తికి మాత్రమే పరిమితం కాకుండా నిర్మాణం, సాంకేతికత,కళ,శిల్పం, నైపుణ్యం వంటి అనేక రంగాలకు స్ఫూర్తినిచ్చేదిగా ఉందన్నారు.

పంచభూతాల ప్రాధాన్యతను వివరించిన డీఆర్వో సృష్టి నిర్మాణంలో పంచభూతాలైన భూమి,నీరు,అగ్ని,వాయువు, ఆకాశాల ప్రాధాన్యత ఎంతో ఉందని డీఆర్వో వివరించారు. ప్రకృతి సమతుల్యత, మానవ జీవనం,జీవజాల మనుగడకు పంచభూతాలు ఆధారమని పేర్కొన్నారు. ప్రకృతితో సమన్వయంగా జీవించడం, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.

అదేవిధంగా భారతీయ జ్ఞాన సంపదకు ప్రతీకలైన ఋగ్వేదం, యజుర్వేదం,సామవేదం, అధర్వణ వేదాల ప్రాధాన్యతను వివరించారు.మహాభారతాన్ని ఐదవ వేదంగా భావించే సంప్రదాయం గురించి కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు. భారతీయ సంస్కృతిలో జ్ఞానం, కళలు,వృత్తులు పరస్పరం అనుసంధానమై ఉన్నాయని తెలిపారు.వసుధైక కుటుంబ భావన విశ్వకర్మ సందేశం

ప్రపంచంలోని ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలనే వసుధైక కుటుంబ భావన శ్రీ విరాట్ విశ్వకర్మ తత్వంలో అంతర్లీనంగా ఉందని జిల్లా రెవెన్యూ అధికారి పేర్కొన్నారు. సమాజంలోని ప్రతి వర్గం పరస్పర సహకారంతో ముందుకు సాగినప్పుడే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు.చతుషష్టి కళల్లో శిల్పకళకు విశిష్టమైన స్థానం ఉందని,మానవ నాగరికత అభివృద్ధిలో శిల్పులు, చేతివృత్తిదారులు అందించిన సేవలు అపారమని తెలిపారు.

సాధారణ రాయిలోని మలినాలను తొలగించి అందమైన శిల్పంగా మలచడం నుంచి,మానవ జీవనానికి అవసరమైన పనిముట్లు, వ్యవసాయ పరికరాలు, నిర్మాణ సామగ్రి తయారీ వరకు వృత్తిదారుల పాత్ర చిరస్మరణీయమని పేర్కొన్నారు.

నాగలి,ఎడ్లబండి వంటి వ్యవసాయ సాధనాలు మానవ సమాజ పురోగతికి ఎంతగానో దోహదపడ్డాయని, సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధికి విశ్వకర్మ సంప్రదాయం స్ఫూర్తిగా నిలుస్తోందని అన్నారు. వృత్తిదారుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలి అని ఆయన అన్నారు.సమాజంలో వృత్తిదారులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని డీఆర్వో సూచించారు.

సంప్రదాయ వృత్తులను పరిరక్షించడంతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసంధానం చేయడం ద్వారా వృత్తిదారుల ఆర్థికాభివృద్ధికి మరింత అవకాశాలు కల్పించవచ్చన్నారు.వృత్తి నైపుణ్యాలను యువతకు అందించేందుకు శిక్షణా కార్యక్రమాలు,ఉపాధి అవకాశాలు,స్వయం ఉపాధి ప్రోత్సాహక కార్యక్రమాలు కీలకమని తెలిపారు.

విశ్వకర్మ జయంతి సందర్భంగా వృత్తిదారుల గౌరవం,వారి కృషి, సేవలను సమాజం గుర్తించాలని పిలుపునిచ్చారు.విశ్వకర్మ మహత్యాన్ని కొనియాడిన సంఘాల నాయకులు అనంతరం విశ్వబ్రాహ్మణ సంఘాల నాయకులు కటోజు కన్నాయిదాసు,ఆవపాటి వేణుగోపాలకృష్ణ,కోచూరి చిదంబరరావు,దేవాదుల సూర్యనారాయణ,చేబ్రోలు గంగనాగేశ్వరరావు తదితరులు శ్రీ విరాట్ విశ్వకర్మ విశిష్టతను వివరించారు.

విశ్వకర్మ జయంతి వృత్తిదారుల శ్రమను, నైపుణ్యాన్ని, సృజనాత్మకతను గుర్తుచేసుకునే పవిత్రమైన రోజుగా పేర్కొన్నారు. సంప్రదాయ చేతివృత్తులను పరిరక్షించేందుకు సమాజం, ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు కలిసి కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ అధికారి పి. భగవాన్,సహాయ సంక్షేమ అధికారి కె.ఎన్.దొర,ఇతర అధికారులు,సిబ్బంది,బీసీ సంక్షేమ సంఘం నాయకులు, విశ్వబ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు, వృత్తిదారులు, తదితరులు పాల్గొన్నారు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM