Vadapalli: వాడపల్లి బ్రహ్మోత్సవాలు, కల్పవృక్ష, అశ్వవాహన సేవల్లో శ్రీనివాసుడు!

Vadapalli: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో 8వ రోజు కల్పవృక్ష, అశ్వవాహన సేవలు ఘనంగా జరిగాయి.

TRIMURTULU, KOTHAPETA
Published on: 6 Nov 2026 11:39 AM IST
Vadapalli
X

Vadapalli: వాడపల్లి బ్రహ్మోత్సవాలు, కల్పవృక్ష, అశ్వవాహన సేవల్లో శ్రీనివాసుడు!

Vadapalli: కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి 14వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు ఉత్సవాలు గురువారం వైభవంగా నిర్వహించారు. ఆశ్వయుజ బహుళ ఏకాదశి సందర్భంగా ఉదయం శ్రీ స్వామివారు ఉభయదేవేరులతో కలిసి కల్పవృక్ష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి కల్కి అలంకరణలో అశ్వవాహనంపై స్వామివారు మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు.

ఉదయం విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, అష్టకలశారాధన, స్నపనం, తిరుప్పావడ సేవ, ప్రధాన హోమాలు, దిగ్దేవతా బలిహరణం, నీరాజన మంత్రపుష్పాలు తదితర వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

సాయంత్రం స్వస్తివాచనం, ప్రధాన హోమాలు, దిగ్దేవతా బలిహరణం, నీరాజన మంత్రపుష్పాలతో పాటు చూర్ణోత్సవాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. రాత్రి కల్కి అలంకరణలో అశ్వవాహన సేవ కనులపండువగా సాగింది.

ఈ ఉత్సవాలను తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణం గోవింద నామస్మరణతో మార్మోగింది.

రేపటితో బ్రహ్మోత్సవాలకు ముగింపు

వార్షిక బ్రహ్మోత్సవాల ముగింపు కార్యక్రమాలు శుక్రవారం నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు మహాపూర్ణాహుతి, చక్రస్నానం కార్యక్రమాలతో తొమ్మిది రోజుల బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగియనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

TRIMURTULU, KOTHAPETA

TRIMURTULU, KOTHAPETA