Sakhinetipalli: అంతర్వేది తీరంలో రింగ్ వలల వివాదం సంప్రదాయ మత్స్యకారుల ఆందోళన
Sakhinetipalli: అంతర్వేది పల్లిపాలెం తీరంలో రింగ్ వలల వేటపై సంప్రదాయ మత్స్యకారుల తీవ్ర అభ్యంతరం. జీవనోపాధిని కాపాడాలని అధికారులకు విజ్ఞప్తి.
Sakhinetipalli: అంతర్వేది తీరంలో రింగ్ వలల వివాదం సంప్రదాయ మత్స్యకారుల ఆందోళన
సఖినేటిపల్లి: సఖినేటిపల్లి మండలం అంతర్వేది పల్లిపాలెం తీర ప్రాంతంలో రింగ్ వలలు, లాగుడు వలల వినియోగంపై వివాదం నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కొందరు ఈ వలలతో చేపల వేట సాగించేందుకు ప్రయత్నించడంపై స్థానిక సంప్రదాయ మత్స్యకారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ విధమైన వేట వల్ల తరతరాలుగా సముద్రాన్నే నమ్ముకుని జీవిస్తున్న తమ కుటుంబాల జీవనోపాధి దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పెద్ద వలల వినియోగం వల్ల చేపల లభ్యత తగ్గడంతో పాటు, చిన్న చేపలు సైతం వలలకు చిక్కి భవిష్యత్తులో సముద్ర చేపల సంపదపై ప్రభావం పడే ప్రమాదం ఉందని మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు.
*నిబంధనలు అమలు చేయాలని డిమాండ్*
చేపల వేటకు సంబంధించి అమలులో ఉన్న చట్టాలు, ప్రభుత్వ నిబంధనల ప్రకారం అధికారులు చర్యలు తీసుకోవాలని మత్స్యకారులు కోరుతున్నారు. అంతర్వేది తీరంలో రింగ్ వలలు, లాగుడు వలల వినియోగంపై వస్తున్న ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, నిబంధనల ఉల్లంఘనలు నిర్ధారణ అయితే బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
అంతర్వేది పల్లిపాలెం, బియ్యపుతిప్ప, సమలదీయ, ఎనుములదీవి, చినమైనవలంక, పెదమైనవలంక, దర్బరేవు, కరవాక, రాజోలు, పెదలంక, గొంది, ఓడలరేవు తదితర ప్రాంతాలకు చెందిన గంగపుత్ర మత్స్యకారులు అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించి, మత్స్యకార సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి ఇరువర్గాల సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
సముద్ర సంపదను కాపాడటంతో పాటు దానిపై ఆధారపడి జీవించే సంప్రదాయ మత్స్యకారుల జీవనోపాధికి భరోసా కల్పించాలని కోరుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి, నిబంధనల అమలును పరిశీలించి అంతర్వేది తీరంలో నెలకొన్న వివాదానికి శాశ్వత పరిష్కారం చూపాలని మత్స్యకారులు విజ్ఞప్తి చేస్తున్నారు.




