Rajamahendravaram: స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు చరిత్రాత్మకం!

Rajamahendravaram: స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమని రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY
Published on: 27 Sept 2026 4:36 PM IST
Rajamahendravaram
X

Rajamahendravaram: స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు చరిత్రాత్మకం!

Rajamahendravaram: సమాజంలో సగభాగంగా ఉన్న బీసీల రాజకీయ, సామాజిక అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం చారిత్రక నిర్ణయాలు తీసుకుంటోందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు తిరిగి 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం బీసీలకు రాజకీయంగా మరింత ప్రాతినిధ్యం కల్పించేందుకు దోహదపడుతుందని తెలిపారు.

ఈ మేరకు ఆదివారం ఆయన ఒక పత్రిక ప్రకటన విడుదల చేశారు. చట్టంలో ఉన్న నిబంధనల ప్రకారం బీసీ రిజర్వేషన్లతోనే పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. గ్రామీణ స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం, పట్టణ స్థానిక సంస్థల్లో 33⅓ శాతం రిజర్వేషన్లు అమలు చేయనున్నట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో ఎలాంటి మార్పు ఉండదని, ప్రస్తుతం అమల్లో ఉన్న రిజర్వేషన్లు యథాతథంగా కొనసాగుతాయని పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ ప్రక్రియ కూడా కొనసాగుతోందన్నారు.

బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యానికి టీడీపీ పెద్దపీట

బీసీలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించడంలో తెలుగుదేశం పార్టీకి నాలుగు దశాబ్దాల చరిత్ర ఉందని ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. నందమూరి తారక రామారావు హయాంలోనే బీసీలను ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులుగా రాజకీయంగా ప్రోత్సహించారని గుర్తుచేశారు. స్థానిక సంస్థల్లో చట్టబద్ధమైన రిజర్వేషన్ల ద్వారా గ్రామస్థాయి నుంచే బీసీ నాయకత్వాన్ని పెంచే విధానానికి ఎన్టీఆర్ పునాది వేశారని తెలిపారు.

చంద్రబాబు నాయుడు హయాంలో 1995లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 34 శాతానికి పెంచినట్లు పేర్కొన్నారు. అయితే గతంలో బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 24 శాతానికి తగ్గించడం వల్ల 16,800 మంది రాజకీయ పదవులు కోల్పోయారని తెలిపారు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ సంక్షేమం, అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. రెండేళ్లలో వివిధ సంక్షేమ పథకాలు, కార్యక్రమాల ద్వారా బీసీల కోసం రూ.32,534 కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. వడ్డెర్లకు 10 శాతం మైనింగ్ లీజులు, గీత కార్మికులకు 10 శాతం ఎక్సైజ్ షాపులు కేటాయించామని తెలిపారు.

నేతన్న సేవలో ఒక్కో కుటుంబానికి ఏడాదికి రూ.25 వేల ఆర్థిక సహాయం, హ్యాండ్లూమ్ మగ్గాలకు నెలకు 200 యూనిట్లు, పవర్‌లూమ్ మగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని చెప్పారు. మత్స్యకారుల సంక్షేమానికి కూడా ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని, వేట విరామ సమయంలో ‘మత్స్యకారుల సేవలో’ పథకం ద్వారా రూ.20 వేల ఆర్థిక సాయం అందిస్తున్నామని తెలిపారు. సబ్సిడీపై బోట్లు, డీజిల్ అందించడంతో పాటు మత్స్యకారుల హక్కులకు రక్షణ కల్పిస్తున్నామని పేర్కొన్నారు.

గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 217ను రద్దు చేసి మత్స్యకార సొసైటీల హక్కులను కాపాడామని తెలిపారు. నాయీ బ్రాహ్మణులు నిర్వహించే సెలూన్లకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, స్వర్ణకారుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు, దేవాలయాల్లో నాయీ బ్రాహ్మణులకు అందించే భృతిని రూ.15 వేల నుంచి రూ.25 వేలకు పెంచినట్లు వివరించారు. మత్స్యకార మహిళలకు సీ వీడ్ పెంపకంపై శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు.

బీసీలకు మరింత రాజకీయ ప్రాతినిధ్యం

రాష్ట్రంలో బీసీల జనాభా 2.66 కోట్లు, మొత్తం జనాభాలో 50.42 శాతంగా ఉందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో బీసీల జనాభా 48.84 శాతం, పట్టణ ప్రాంతాల్లో 54.36 శాతంగా ఉందన్నారు. 138 బీసీ ఉపకులాలకు న్యాయం చేసేలా టీడీపీ ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. స్థానిక సంస్థల్లో తిరిగి 34 శాతం రిజర్వేషన్లు కల్పించడం ద్వారా బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం మరింత పెరుగుతుందని అన్నారు.

ఎన్నికల్లోనే కాకుండా గ్రామస్థాయి నుంచి నాయకత్వాన్ని అభివృద్ధి చేసే దిశగా ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని తెలిపారు. కాగా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు బీసీలకు న్యాయం చేసేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. బీసీలకు అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని రాజకీయంగా, సామాజికంగా మరింత ఉన్నత స్థానాలకు ఎదగాలని, బీసీల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం ఎప్పటికీ అండగా ఉంటుందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఈ ప్రకటనలో పేర్కొన్నారు.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY

RAGHAVENDRA, RAJUMUNDRY CITY