Rajahmundry: సమష్టి కృషితో రాజమండ్రిని వేగంగా పునరుద్ధరించాం: ఎమ్మెల్యే
Rajahmundry: రాజమండ్రిలో సమష్టి కృషితో 90% విద్యుత్ పునరుద్ధరణ, 58 కూలిన చెట్ల తొలగింపు పూర్తి చేసి నగరాన్ని సాధారణ స్థితికి తెచ్చామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు.
Rajahmundry: సమష్టి కృషితో రాజమండ్రిని వేగంగా పునరుద్ధరించాం: ఎమ్మెల్యే
రాజమండ్రి: అర్నాబ్ తుపాను నేపథ్యంలో నగరంలో ప్రజలకు ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా, విద్యుత్ సరఫరా ఇతర అత్యవసర సేవలను వేగంగా పునరుద్ధరించేందుకు అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేశారని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. స్థానిక 43వ డివిజన్లోని వీవర్స్ కాలనీ స్కేటింగ్ పార్కు వద్ద గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
తుపాను సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చూపిన నాయకత్వం, రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా అందించిన ఎప్పటికప్పుడు సూచనలు, హెచ్చరికలు విపత్తు నిర్వహణలో ఎంతగానో ఉపయోగపడ్డాయని ఆయన వివరించారు. తుపాను ప్రభావం, గాలుల తీవ్రత, వర్షాల పరిస్థితులను ముందుగానే అంచనా వేస్తూ అధికారులు అప్రమత్తంగా వ్యవహరించారని తెలిపారు.
నగరంలో వివిధ అభివృద్ధి పనులు జరుగుతున్న నేపథ్యంలో శానిటేషన్, ఇంజినీరింగ్ శాఖల అధికారులు రెండు రోజుల ముందుగానే ప్రధాన డ్రైనేజీలను పరిశీలించి, పూడిక తొలగింపు, బ్లాకేజీల నివారణ చర్యలు చేపట్టారని చెప్పారు. మార్కెట్ యార్డు నుంచి కంబాల చెరువు జంక్షన్ వరకు కొన్ని ప్రాంతాల్లో నీరు నిలిచినప్పటికీ, డ్రైనేజీ వ్యవస్థ ద్వారా నీరు బయటకు వెళ్లడంతో పెద్ద సమస్యలు తలెత్తలేదన్నారు. ముందస్తు ప్రణాళిక, అధికారుల సమన్వయం వల్ల నగరంలోని అనేక ముంపు ప్రాంతాల్లో పరిస్థితిని సమర్థంగా నియంత్రించగలిగామని వివరించారు.
90 శాతం విద్యుత్ సరఫరా పునరుద్ధరణ
తుపాను కారణంగా దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థను వేగంగా పునరుద్ధరించేందుకు విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది అహర్నిశలు శ్రమించారని ఎమ్మెల్యే వాసు తెలిపారు. నగరంలో టౌన్-1, టౌన్-2 పరిధుల్లో విద్యుత్ స్తంభాలు, ఫీడర్లు, ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నప్పటికీ యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టామన్నారు.
ఈ మీడియా సమావేశం సమయానికి సుమారు 90 శాతం విద్యుత్ సరఫరాను పునరుద్ధరించగలిగామని, మిగిలిన ప్రాంతాల్లోనూ సాయంత్రానికి సరఫరాను సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టామని చెప్పారు. టౌన్-1 పరిధిలో 11 కేవీ ఫీడర్లకు సంబంధించిన సమస్యలను పరిష్కరించగా, దెబ్బతిన్న ట్రాన్స్ఫార్మర్లలో తొమ్మిదింటిని పునరుద్ధరించామని తెలిపారు.
టౌన్-2 పరిధిలో దెబ్బతిన్న ఆరు ట్రాన్స్ఫార్మర్లకు మరమ్మతులు పూర్తి చేశామని, 13 విద్యుత్ స్తంభాల స్థానంలో కొత్త స్తంభాలను ఏర్పాటు చేశామని వివరించారు. నాలుగు 33 కేవీ ఫీడర్ల మరమ్మతులు పూర్తయ్యాయని, 11 కేవీ ఫీడర్లలో మిగిలిన సమస్యలను కూడా పరిష్కరిస్తున్నామని చెప్పారు. భారీ వృక్షాలు కూలిపోవడంతో రహదారులపై ఏర్పడిన అడ్డంకులను తొలగించేందుకు మున్సిపల్ కార్పొరేషన్, విద్యుత్ శాఖ, పోలీస్, ఆరోగ్య, ఇంజినీరింగ్ శాఖల సిబ్బంది సమన్వయంతో పనిచేశారని తెలిపారు.
నగరంలో గుర్తించిన 85 పడిపోయిన చెట్లలో 58 చెట్లను తొలగించామని, మిగిలిన వాటి తొలగింపు పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. క్రేన్లు, జేసీబీలు, అదనపు ప్రైవేట్ సిబ్బందిని వినియోగించి సహాయక చర్యలు చేపట్టామని చెప్పారు. మిగిలిన చెట్ల తొలగింపు, వ్యర్థాల శుభ్రతను శనివారం నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.
సిబ్బందికి అండగా క్షేత్రస్థాయిలో పర్యటన
భారీ వర్షాలు, బలమైన గాలుల మధ్య విద్యుత్ సిబ్బంది, ఇతర శాఖల సిబ్బంది ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించారని ఎమ్మెల్యే వాసు ప్రశంసించారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ వారికి ధైర్యం చెప్పడంతో పాటు సమస్యల పరిష్కారంపై అధికారులతో సమీక్షించానన్నారు. ప్రజల భద్రత, సంక్షేమం దృష్ట్యా తాను క్షేత్రస్థాయికి వెళ్లానని, ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ముందడుగు వేస్తే దేవుడి ఆశీస్సులు ఉంటాయని విశ్వసిస్తున్నానని చెప్పారు.
ప్రజలకు అండగా నిలవని వైసీపీ నాయకులు
తుపాను వంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు అండగా నిలవాల్సిన ప్రతిపక్ష వైఎస్సార్సీపీ నాయకులు క్షేత్రస్థాయిలో కనిపించలేదని ఆదిరెడ్డి శ్రీనివాస్ విమర్శించారు. నగరంలో అభివృద్ధి పనులు జరుగుతున్న సమయంలో రాజకీయాలు చేయడం కంటే, ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారికి సహాయం చేయడం ముఖ్యమన్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు సమస్యలు తలెత్తిన ప్రాంతాలకు చేరుకుని అధికారులతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యల్లో పాల్గొన్నారని తెలిపారు.
విపత్తు సమయంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది చూపిన అంకితభావం అభినందనీయమని పేర్కొన్నారు. కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, విద్యుత్ శాఖ, పోలీస్, శానిటేషన్, ఇంజినీరింగ్ సిబ్బందితో పాటు సహాయక చర్యల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.
భవిష్యత్తులో ఎలాంటి ప్రకృతి విపత్తులు ఎదురైనా రియల్ టైమ్ గవర్నెన్స్, ముందస్తు ప్రణాళిక, శాఖల మధ్య సమన్వయంతో సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు.
మీడియా సమావేశంలో డివిజన్ ఇంచార్జ్ కంటిపూడి శ్రీనివాస్, ప్రెసిడెంట్ గండేబత్తుల రామకృష్ణ, సెక్రెటరీ కెల్లా శ్రీను, వైస్ ప్రెసిడెంట్ సతీష్, ట్రెజరర్ కోటి ప్రసాద్, శేఖర్ రెడ్డి, బాబు, శివ, చల్లా వెంకటేష్, జనసేన ధర్మరాజు రాజు, కమ్మ డైరెక్టర్ సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.




